Best Web Hosting Provider In India 2024
Gongura Chicken Pulao: చికెన్ రెసిపీలు టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ తో చేసే బిర్యానీలు అంటే చెవి కోసుకుంటారు. అలాగే చికెన్ పులావ్ కూడా నోరూరిపోతుంది. ఒకసారి గోంగూర చికెన్ పులావ్ చేసి చూడండి. ఇది కాస్త కొత్తగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ తినే బిర్యాని కన్నా నాలుగు ముద్దలు ఎక్కువే తినడం ఖాయం. అంత రుచిగా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ పలావ్‌ను… గోంగూరలోని పుల్లదనం, చికెన్ కర్రీలోని స్పైసీ రుచి కలిసి ఆస్వాదించవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఒకసారి గోంగూర చికెన్ పులావ్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
గోంగూర చికెన్ పులావ్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ – అర కిలో
బాస్మతి రైస్ – అర కిలో
గోంగూర – ఒక కట్ట
బిర్యానీ ఆకులు – రెండు
షాజీరా – అర స్పూను
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – మూడు
లవంగాలు – నాలుగు
అనాస పువ్వు – ఒకటి
పచ్చిమిర్చి – ఐదు
ఉల్లిపాయ – రెండు
నెయ్యి – ఒక స్పూన్
నూనె – రెండు స్పూన్లు
కారం – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
జీడిపప్పులు – గుప్పెడు
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా పొడి – ఒక స్పూను
పుదీనా తరుగు – రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
గోంగూర చికెన్ పులావ్ రెసిపీ
1. బాస్మతి రైస్‌ను ముందుగానే శుభ్రంగా కడిగి అరగంటసేపు నీటిలో నానబెట్టాలి.
2. అలాగే చికెన్‌ను కూడా శుభ్రంగా కడిగే పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. గోంగూరను కుళాయి కింద కడిగి గోంగూర ఆకులను తీసి ఒక గిన్నెలో వేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.
5. ఆ నూనెలో గోంగూరని వేసి బాగా మగ్గనివ్వాలి. గోంగూర పేస్టులా మారిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
6. ఇప్పుడు బిర్యానీ వండుకునే కుక్కర్ స్టవ్ మీద పెట్టాలి.
7. అందులో ఒక స్పూను నెయ్యి, రెండు స్పూన్ల నూనె వేసి బాగా వేడి చేయాలి.
8. అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, లవంగాలు, యాలకులు, షాజీరా కూడా వేసి కలుపుకోవాలి.
9. నిలువుగా కోసిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి. అది రంగు మారేవరకు ఉంచాలి.
10. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును వేసి వేయించుకోవాలి.
11. ఇప్పుడు చికెన్ ను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. అందులోనే కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
13. ఇది ఇగురు లాగా దగ్గరగా అవుతుంది. అప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న గోంగూర పేస్టును వేసి బాగా కలపాలి.
14. కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసి బాగా కలపనివ్వాలి.
15. మూత పెట్టి ఇగురులాగా ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలుపుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టాలి.
16. అవసరమైతే ఉప్పును వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
17. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీయాలి. ఘుమఘుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది.
18. ఈ గోంగూర చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఉందనిపిస్తే పైన కొంచెం నెయ్యిని చల్లుకుని తినవచ్చు.
గోంగూర చికెన్ ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. గోంగూర చికెన్ పులావ్ ను ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్లీ చేసుకోవడం ఖాయం… అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.
టాపిక్