సిట్‌ చీఫ్‌ను కలిసిన వైయస్‌ఆర్‌ సీపీ ప్రతినిధుల బృందం

Best Web Hosting Provider In India 2024

అల్లర్లపై సమగ్ర విచారణ జరపాలని, కుట్రదారులను శిక్షించాలని విజ్ఞప్తి

బాబు, పురందేశ్వరిల ఫిర్యాదుల వల్లే అధికారుల మార్పులు

ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస, అల్లర్లు, అక్కడే సస్పెన్షన్లు

పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.. టీడీపీతో కొందరు కుమ్మక్కయ్యారు

పోలీసుల కాల్‌ డేటాను కూడా పరిశీలించాలని కోరాం 

టీడీపీ హింసకు పాల్పడితే తిరిగి మాపై తప్పుడు కేసులు పెట్టారు

జిల్లాల్లో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే హింస జరిగింది

మంగళగిరి: పోలింగ్, ఆ తరువాతి రోజు రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై సమగ్ర విచారణ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కోరింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌రెడ్డిలు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఈసీ నియమించిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ చీఫ్‌ వినీత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సిట్‌ చీఫ్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడంతో పాటు అల్లర్లకు కారణమైన కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిసిన అనంతరం డీజీపీ కార్యాలయం ఎదుట వైయఆర్‌సీపీ ప్రతినిధుల బృందం మీడియాతో మాట్లాడింది. 

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఉన్న కలెక్టర్లు, ఎస్పీలను ఎన్నికల కమిషన్‌ మార్చేసింది. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు కలిసి అధికారులపై కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు. వారి ఫిర్యాదుల ఆధారంగా అధికారులను మార్చారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతిలో ఎస్పీలను మార్చారు.. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయి.. అక్కడే అధికారుల సస్పెన్షన్లు జరిగాయి. అక్కడే మళ్లీ కొత్త అధికారులను నియమించారు. అక్కడే స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ వేసి విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడిందంటే వాస్తవాలు గమనించాలని ప్రజలను కోరుతున్నాను. 

ఇది దారుణమైన పరిస్థితి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిన సందర్భం. పోలీస్‌ యంత్రాంగం పూర్తిగా టీడీపీతో కుమ్మక్కైంది. టీడీపీతో కుమ్మక్కై ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం కోసం పావులుగా పోలీసులు పనిచేశారంటే కంచె చేను మేసినట్టు కాదా..? చేసిన తప్పుకు ఈసీతో చీవాట్లు తిని పోలీస్‌ యంత్రాంగం బాధ్యత వహిస్తోంది. పోలీసులను విచారణ చేయమని ఈసీ ఆదేశించిందంటే ఇది చిన్న విషయం కాదు. 

జిల్లాల్లో పూర్తి అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే హింస జరిగింది. ఎన్నికల సమయంలో జరిగిన దౌర్జన్యకాండకు సంబంధించి వైయస్‌ఆర్‌ సీపీ కేసు ఇస్తే.. ఇప్పుడు బ్యాలెన్స్‌ చేయడానికి కౌంటర్‌ కేసు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 324 వేయాల్సిన చోట 307 సెక్షన్‌ మాపై వేస్తున్నారు. గందరగోళ పరిస్థితి నెలకొల్పుతున్నారు. ఇది వన్‌ సైడెడ్‌గా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. టీడీపీ హింసకు పాల్పడితే తిరిగి మాపై తప్పుడు కేసులు పెట్టారు. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ముఖ్యంగా తిరుపతి, పల్నాడు, అనంతపురం ప్రాంతాల్లో దౌర్జన్యాలకు కారణమై పోలీసులు కొల్యూడ్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై సిట్‌ చీఫ్‌ వినీత్‌కు వివరంగా వివరించాం. ఫాల్స్‌ కేసులు నివారించండి.. అవసరమైతే ఎస్‌ఐలు, సీఐల వద్ద కాల్‌ డేటాను సేకరించాలని, ఎవరెవరు ఏమేమి మాట్లాడారో తెలుస్తుందని కోరాం. 

తప్పు చేసిన అధికారులను శిక్షించాలని కోరుతున్నాం. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్లి సీసీ కెమెరాలను పోలీసులే ధ్వంసం చేశారు. పెద్దారెడ్డికి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీతో కుమ్మకై ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి చేశారు. ఎక్కడైతే ఎస్పీని మార్చారో అక్కడే పోలీసులు వెళ్లి వారితో కుమ్మకయ్యారు. మార్పు వల్ల తెలుగుదేశం పార్టీకి ఉపయోగం జరుగుతుందని భావించి చేసినట్టుగా అర్థం అవుతుంది. దీనిలోని కుట్రదారులు బయటకు రావాలి, వారిపై యాక్షన్‌ తీసుకోవాలని వివరించాం. న్యాయం జరుగుతుందని వైయస్‌ఆర్‌ సీపీ ఆశిస్తుంది. యాక్షన్‌ సిన్సియర్‌గా, సీరియస్‌గా, ప్రాపర్‌గా ఉండాలని భావిస్తున్నాం’ అని మంత్రి అంబటి కోరారు. 
 

Best Web Hosting Provider In India 2024