Best Web Hosting Provider In India 2024
Hyderabad Finance Fraud : హైదరాబాద్ నగరంలో మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దాచి దాచి దయ్యాల పాలు చేసినట్లు అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో కోట్లు డిపాజిట్ చేస్తున్నారు. కానీ నకిలీ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు రాత్రికి రాత్రే ఉన్న కాడికి ఉడాయించి విదేశాలకు పారిపోతున్నారు.హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లోని అబిడ్స్ లోని శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజర్స్ పేరుతో ఓ సంస్థ తమ వద్ద పెట్టుబడులు పెడితే మార్కెట్ వడ్డీల కన్నా అధిక రేటు చెల్లిస్తామని మాయ మాటలు చెప్పింది. సంస్థకు ఏజెంట్స్ ను నియమించి వారి ద్వారా ప్రజల నుంచి కోట్ల రూపాయల డిపాజిట్లను సదరు సంస్థ రాబట్టింది. దాదాపు 520 మంది నుంచి ఏకంగా రూ.200 కోట్లను సంస్థ రాబట్టి…. రాత్రికి రాత్రే సంస్థ ప్రతినిధులు బోర్డు తిప్పేసారు. బాధితులు సంస్థ ప్రతినిధులను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేయగా…….ఫలితం లేకుండా పోయింది. దీంతో మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ సీసీఎస్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థ నిర్వాహకులు కోసం గాలిస్తున్నారు.
చిట్టీల పేరిట భారీ మోసం
చిట్ ఫండ్స్ డిపాజిట్ల పేరుతో ఓ కుటుంబం దాదాపు 50 మందిని మోసం చేసింది. కూకట్ పల్లికి చెందిన చేగొండి సూర్యనారాయణ కుటుంబం చిట్ ఫండ్స్ పేరుతో 2020 లో దాదాపు 50 మంది నుంచి సుమారు రూ.15 కోట్లు కట్టించుకొంది. గడువు ముగిసిన బాధితులకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. బాధితులు ఆందోళన చేయడంతో సూర్యనారాయణ కుటుంబం తమకున్న ఇండ్లు, ఫ్లాట్లు అమ్ముకొని నగరం నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు 2021లో కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు 2022 లో సూర్యనారాయణ కుటుంబాన్ని బెంగళూరు లో అరెస్ట్ చేశారు. కాగా వీరు బెయిల్ పై విడుదల అయ్యారని కానీ తమకు డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పోలీస్ స్టేషన్ లు, అధికారులు చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు.ఇప్పటికైనా పోలీసులు,ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఏఎస్సై పేరుతో రూ.75 వేలు స్వాహా
సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆఖరికి పోలీసుల పేరును కూడా వాడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడ్చెర్ల పట్టణంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నేరేడ్చేర్ల పట్టణంలోని ఓ పెట్రోల్ బాంక్ యజమానికి ఈనెల 18న సాయంత్రం ఓ ఫోన్ వచ్చింది. ” నేను ఏఎస్సై ని మాట్లాడుతున్న…..మా ఎస్సై సార్ వాళ్ల కూతురికి సీరియస్ గా ఉంది. అర్జంట్ గా ఒక రూ.75 వేలు అవసరం ఉన్నాయి. నేను నీకు 75 వేల నగదు పంపుతాను.నువ్వు నాకు ఫోన్ పే చేయి” అంటూ ఓ సైబర్ నేరగాడు పెట్రోల్ బంకు యజమానికి ఫేక్ కాల్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి నిజమేనని నమ్మి సైబర్ నేరగాడు పంపిన క్యూ ఆర్ కోడ్ కు రూ.75 వేలు పంపాడు. ఎంతకూ 75 వేల నగదు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
టాపిక్