Best Web Hosting Provider In India 2024
Nandi Hills Tour : వేసవిలో కుటుంబం లేదా స్నేహితులతో ఓ ట్రిప్ నకు వెళ్లాలని భావిస్తున్నారా? అయితే కర్ణాటకలోని నంది హిల్స్ చక్కటి టూరిస్ట్ స్పాట్. ఆహ్లాదకరమైన వాతావరణం, అడ్వెంచర్స్ ఇష్టపడేవాళ్లు బెస్ట్ ప్లేస్. బెంగళూరు నుంచి వీకెండ్ ట్రిప్ కోసం చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. నార్త్ పాలార్, సౌత్ పెన్నార్, చిత్రావతి, అర్కావతి పాపఘ్ని నదులు నంది కొండలలోనే పుట్టాయి. సముద్ర మట్టానికి 4850 అడుగుల ఎత్తులో ఉన్న నంది హిల్స్ సుందరమైన ప్రదేశాలకు నెలవు. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్య రహిత గాలి, నిర్మలమైన పరిసరాలు వేసవి విడిదికి చక్కటి ప్రదేశాలు. కొండల్లో ఆహ్లాదకరంగా షికారు చేయవచ్చు. సాహసికులు పారాసైలింగ్ చేయవచ్చు.
సందర్శనీయ ప్రదేశాలు
నంది కొండలలో దేవాలయాలు- నంది హిల్స్ రెండు పురాతనమైన శివాలయాలు ఉన్నాయి. నంది కొండల పైన ఉన్న యోగానందిశ్వర దేవాలయం చోళ నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ ఆలయ గర్భగృహ ప్రవేశద్వారం రెండు వైపులా ఇత్తడిపూత తలుపులు, ద్వారపాలకులు చిత్రాలు ఉంటాయి. ఇవి విజయనగర పాలకుడు కృష్ణదేవరాయల కానుకలని చెబుతారు. నంది హిల్స్‌కు సమీపంలో ఉన్న నంది గ్రామంలో భోగనందీశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయం క్రీ.శ. 9వ శతాబ్దానికి పూర్వం చోళ, హోయసల, విజయనగర కాలాలలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ కు చెందిన చిన్న రెండంతస్తుల భవనం ఈ కొండలపై ఉంది. టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా దీనిని చెబుతారు.
సూర్యోదయం సూపర్
నంది హిల్స్‌లో కుటుంబంతో సహా వచ్చి ఎంజాయ్ చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్/ప్లే ప్రదేశాలు ఉన్నాయి. నంది కొండలపైన సూర్యోదయం ఎంతో మనోహరంగా ఉంటుంది. నంది హిల్స్ మార్గంలో అనేక రెస్టారెంట్లు ఉంటాయి. ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించే కోతుల పట్ల పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి. రద్దీగా ఉండే వారాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. పర్యాటకులు తమ వాహనాలను కొండ దిగువన పార్క్ చేయవలసి ఉంటుంది. కొండపైకి చేరుకోవడానికి షటిల్ బస్సులు ఉంటాయి. కొండపైన కూడా పార్కింగ్ స్థలం ఉంటుంది.
నంది కొండలకు ఎలా చేరుకోవాలి?
- బెంగళూరు నుంచి 60 కి.మీ దూరంలో నంది హిల్స్ ఉంటుంది. బెంగళూరు నుంచి ప్రైవేట్ వాహనం లేదా టాక్సీలో చేరుకోవడం ఉత్తమం. బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 35 కి.మీ దూరంలో నంది హిల్స్ ఉంటాయి.
- నంది హిల్స్ నుంచి 20 కి.మీ దూరంలో ఉన్న ముద్దెనహళ్లి (మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మస్థలం), దేవనహళ్లి కోట (25 కి.మీ), ఘటి సుబ్రమణ్య దేవాలయం (30 కి.మీ), భోగ నందీశ్వర దేవాలయం (15 కి.మీ) ఉన్నాయి.
- నంది హిల్స్ సమీపంలో వసతి స్థలాలు – నందిహిల్స్ పైన KSTDC- మయూర పైన్ టాప్ హోటల్ ఉంది. ఒక రాత్రి బస కోసం సాయంత్రం 05:00 గంటలకు చేరుకోవాలి. www.kstdc.co సైట్ ద్వారా రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
కర్ణాటక టూరిజం- నంది హిల్స్ టూర్ ప్యాకేజీ
నంది హిల్స్ కు కర్ణాటక టూరిజం వన్ డే రోడ్ ట్రిప్ ప్యాకేజీ అందిస్తుంది. ఏసీ డీలక్స్ కోచ్ ద్వారా బెంగళూరు బీఎంటీసీ యశ్వంతపూర్ నుంచి నంది హిల్స్ కు టూర్ ఉంటుంది. ఈ టూర్ లో దేహనహల్లి, నంది హిల్స్ కవర్ చేస్తారు. అన్ని ముఖ్యమైన సందర్శనా స్థలాలను చూడడానికి తగినంత సమయాన్ని ఇస్తారు. టూరిస్ట్ స్పాట్‌లు, వాటి గురించి గైడ్ మీకు వివరిస్తారు. ఒక వ్యక్తికి రూ. 770 ఛార్జ్ చేస్తారు.
ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు, బుక్కింగ్ కోసం https://www.kstdc.co/tour-packages/nandi-hills-sight-seeing/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్