సంక్రాంతి పండగపూట కూడా సొంతూళ్లో నిజాలు మాట్లాడరా?

తాడేప‌ల్లి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను సభ్యతతో ప్రజలకు రాజకీయ సందేశం ఇస్తూ మాట్లాడుతుంటే–పాలకపక్షం నేతలు అడ్డగోలుగా విమర్శిస్తున్నారని అన్నారు. అదీ పండగపూట సొంతూరు నారావారిపల్లెలో. అబద్ధాలు, అవాస్తవాలతో నిండిన ప్రసంగాలు చేసే ఈ మాజీ ముఖ్యమంత్రి గారు తాను పుట్టి పెరిగిన గ్రామంలోనైనా మంచి మాటలు చెబుతారని అనుకోవడం అత్యాశే. పొద్దున లెగిస్తే తన రాజకీయ ప్రత్యర్ధులను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం నేతలను సైకోలు, నియంతలు, దౌర్జన్యకారులు అంటూ నోటికొచ్చినట్టు తిట్టిపోసే మాజీ హైటెక్‌ ముఖ్యమంత్రి తాను సభ్యతతో మాట్లాడతానని చెప్పడం ఆశ్చర్యకరం. ఈ ఏడాది రాష్ట్రంలో ఊరూరా భోగి, సంక్రాంతి పండగలు మున్నెన్నడూ లేనంత ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకుంటూ, వీధుల్లో, రహదారుల్లో బంధుమిత్రులను కలుస్తూ సామూహిక జీవనానికి సంకేతంగా నిలుస్తున్నారు. మరి, సొంతూళ్లో సంక్రాంతి పండగ జరుపుకోవడానికి వచ్చిన ఈ ‘పెద్దాయన’ ఇవేమీ చూడకుండా సత్యదూరమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఏపీలోని రోడ్లు, గ్రామాల్లోని వాతావరణం చూసి జనం భయపడుతున్నారనే పచ్చి అబద్ధం ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు గారు నారావారిపల్లెలో ప్రయత్నించారు. తెలుగు జనం నాలుగు రోజులు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి రోజున కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సందేశంలో శుభాలు మాట్లాడలేదు చంద్రబాబు. ప్రభుత్వం అమాయకులపై కేసులు పెడుతున్నట్టు ఆయన చెబుతున్నారు. కేసులకు జనం భయపడితే ‘బానిసత్వం’ తప్పదని టీడీపీ అధ్యక్షుడు బెదిరించడం ఆయన సందర్భ శుద్ధి లేకుండా మాట్లాడతారని నిరూపిస్తోంది. తాను సభ్యతతో పోతుంటే సంస్కారహీనులు తప్పుడు పద్ధతిలో మాట్లాడుతున్నారంటూ ప్రత్యర్ధులపై విరుచుకుపడే తన నైజాన్ని ఆయన బయటపెట్టుకున్నారు. తెలుగుదేశం నిర్వాకాల వల్ల జనం మరణిస్తే–అందులో కూడా కుట్ర కోణం చంద్రబాబుకు కనిపిస్తోంది. పాలకపక్షం పనుల్లో, ప్రభుత్వానికి సంబంధం లేని సంఘటనలు, పరిణామాల్లో సైతం ఏపీ సర్కారు కుట్రలే చంద్రబాబుకు దర్శనమిస్తాయి. తెలుగుదేశం అధ్యక్షుడి ప్రకటనలు, ప్రసంగాలు, బెందిరింపులూ  ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జరిగే ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *