TS Universities VCs : తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం, కేయూలో ఫైళ్ల మాయం కలకలం!

Best Web Hosting Provider In India 2024

TS Universities VCs : తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇన్ ఛార్జ్ వీసీలను నియమించింది. ఇన్‌ఛార్జ్‌ వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్‌, జేఎన్‌టీయూ వీసీగా బి.వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వీసీగా రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్‌ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్రమోహన్‌, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్‌, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కేయూలో కీలక ఫైళ్లు మాయం, రిజిస్ట్రార్​ కు ​ ఫిర్యాదు

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్​ ఛాన్స్ లర్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు ప్రభుత్వం పది యూనివర్సిటీలకు ఇన్​ఛార్జ్​ వీసీలను నియమించింది. ఇదిలాఉంటే మూడేళ్ల పదవీకాలంలో రాష్ట్రంలోని వర్సిటీలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోగా, కాకతీయ యూనివర్సిటీలో చివరి రోజు కూడా అలజడి చెలరేగింది. వీసీ ప్రొఫెసర్​తాటికొండ రమేష్​తన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వర్సిటీకి చెందిన పలు కీలక ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అసోసియేషన్​ఆఫ్​కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) జనరల్ సెక్రటరీ డాక్టర్​మామిడాల ఇస్తారి కేయూ రిజిస్ట్రార్​ప్రొఫెసర్​మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు. కాగా వర్సిటీ నుంచి ఏ ఫైళ్లు మిస్​అయ్యాయో తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరిపించాలని అకుట్ నేతలు డిమాండ్​ చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా షిఫ్ట్​?

కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ పై ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి విజిలెన్స్​ విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే రోజు విద్యాశాఖ కార్యదర్శి కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డికి ఎలాంటి ఫైల్స్ ముట్టుకోకూడదనే మౌఖిక అదేశాలిచ్చినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో ఆ రోజు నుంచి వీసీ రమేష్​ క్యాంపస్​ లో అడుగు పెట్టడం లేదు. ఇదిలా ఉంటే పదవీకాలం ముగియడానికి ఒక్క రోజు ముందు, ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వీసీ లాడ్జి నుంచి ఫైళ్ల సంచులు యూనివర్సిటీ బయటకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో విషయం తెలుసుకున్న అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఇస్తారి, అధ్యక్షుడు ప్రొఫెసర్​ తౌటం శ్రీనివాస్​, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్​బ్రహ్మేశ్వరి, సంయుక్త కార్యదర్శి డాక్టర్​ కిషోర్ కుమార్, డాక్టర్ రమేష్ కుమార్ లు మంగళవారం ఉదయం కేయూ క్యాంపస్​లోని అడ్మినిస్ట్రేషన్​ భవనానికి చేరుకుని రిజిస్ట్రార్ ను నిలదీశారు. ఫైళ్లు మాయమైన విషయమై రిజిస్ట్రార్​తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు వర్సిటీ పరిపాలన భవనం వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం ఫైళ్లు మాయమైన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, విజిలెన్స్​ అధికారులకు కూడా సమగ్ర నివేదిక అందించాలని అకుట్​ నేతలు రిజిస్ట్రార్​ మల్లారెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఫైళ్లను ఫ్యాబ్రికేషన్​ చేయడానికే

గత నాలుగు రోజుల నుంచి వీసీ రమేశ్​కేయూకు రావడం లేదని, విజిలెన్స్ విచారణలో కీలకమైన ఫైళ్లను ఫ్యాబ్రికేషన్ చేయడానికి వీసీ లాడ్జి నుంచి వాటిని ఇంటికి తరలించారని అకుట్​ జనరల్ సెక్రటరీ డా.మామిడాల ఇస్తారి ఆరోపించారు. ఉన్నత విద్యాశాఖ నుంచి స్పష్టమైన అదేశాలు ఉన్నప్పటికీ ఫైళ్లను కారులో బయటకు తీసుకు వెళ్లడం పట్ల అనుమానాలు ఉన్నాయని అన్నారు. గత మూడేళ్లలో ప్రొఫెసర్​ రమేశ్​తన పాలనను వీసీ లాడ్జి నుంచే కొనసాగించారని, అక్కడి నుంచి తరలించిన ఫైళ్లపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు. వీసీ లాడ్జి నుంచి తరలించిన ఫైళ్లలో పలు మార్పులు చేసే అవకాశం ఉందని, వివిధ డీన్ల వద్ద ఉన్న పీహెచ్డీలలో పార్ట్ టైం, ఫుల్ టైమ్ అడ్మిషన్లకు సంబంధించిన ఫైళ్లు, విద్యార్థులకు వచ్చిన మార్కుల లిస్ట్, కంప్యూటర్ల కొనుగోలుకు సంబంధించిన అప్రూవల్ ఆర్డర్లను మార్చే అవకాశం ఉందని ఆరోపించారు. కొత్త ఫైళ్ల పైన పాత తేదీలతో సంతకాలు పెట్టే ఛాన్స్​ ఉందని, న్యాక్ కు సంబంధించిన తప్పుడు బిల్లులను సరిచేయడానికి, న్యాక్ బడ్జెట్ నుంచి కాక న్యాక్ కు సంబంధించిన పనులను ఇతర రెగ్యులర్ బడ్జెట్ నుంచి తీసుకున్న అప్రూవల్ ఆర్డర్లను ఫాబ్రికేషన్ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. వీసీ లాడ్జి సీసీ ఫుటేజి వెలికి తీసి దర్యాప్తు చేపట్టాలని, ఫైళ్లు మాయం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై కేయూ పోలీస్ స్టేషన్​ లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు డా.ఇస్తారి వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsUniversitiesWarangalGovernment Of TelanganaTrending TelanganaTelugu NewsHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024