అనంతపురం: 2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో నిర్వహించిన జగనన్న సచివాలయం కన్వీనర్లు, గృహసారథుల (జేసీఎస్) మండల కన్వీనర్లతో రీజినల్ కోఆర్డినేటర్ చల్లా మధుసుదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారులు అలూరు సాంబ శివారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ చైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు. ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వం పై ఉన్న సానుకూల ధోరణిని ఓట్ల రూపంలో తీసుకురావాల్సిన బాధ్యత సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులపై ఉందన్నారు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే 175 స్థానాలు గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారధుల పాత్ర కీలకం కానుందని చెప్పారు.