Best Web Hosting Provider In India 2024
Manchu Vishnu: బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ చిక్కుల్లో పడ్డారు. గతవారంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కూడా పాల్గొన్నారని తేలడంతో ఆమె చుట్టూ ఈ కేసు ఉచ్చుబిగుస్తోంది. హేమ డ్రగ్స్ తీసుకున్నారని, బ్లడ్ శాంపిల్ టెస్టులో ఆమె పాజిటివ్‌గా వచ్చిందని కూడా సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం మరింత పెద్దదైంది. దీంతో మూవీ ఆర్టిస్ట్ యూనియన్ (MAA) నుంచి హేమను తొలగించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో మా అధ్యక్షుడిగా ఉన్న హీరో మంచు విష్ణు స్పందించారు.
అప్పటి వరకు నిర్దోషే.. ఆగండి
నేరం నిరూపితమయ్యే వరకు హేమ నిర్దోషే అని, అప్పటి వరకు ఆధారాలు లేకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని మంచు విష్ణు కోరారు. పుకార్ల ఆధారంగా ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని నేడు (మే 25) ట్వీట్ చేశారు. “ఇటీవల రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసుసు సంబంధించిన విషయంలో కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు హేమ గురించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. పూర్తిగా ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు, తుది నిర్ధారణకు వచ్చేయవద్దు. దోషిగా నిరూపణ అయ్యే వరకు హేమ నిర్దోషే” అని విష్ణు ట్వీట్ చేశారు.
హేమ భార్యగా, తల్లిగా ఉన్నారని.. పుకార్ల ఆధారంగా ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగేలా దూషించడం అన్యాయమని విష్ణు పేర్కొన్నారు. కచ్చితమైన సాక్ష్యాధారాలు తేలితేనే హేమపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. “చట్టవిరుధ్యమైన చర్యలను మూవీ ఆర్టిస్ట్ ఆసోసిషన్ (మా) ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన సాక్ష్యాధారాలను పోలీసులు అందచేస్తే ఆమెపై మా చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు నిరాధారమైన సమాచారాన్ని సంచలనంగా వ్యాప్తి చేయకుండా ఉండండి” అని మంచు విష్ణు తెలిపారు.
రేవ్ పార్టీలో డ్రగ్స్ విషయంలో బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొందరికి నోటీసులు జారీ చేశారు. సోమవారం (మే 27) విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హేమకు కూడా ఈ నోటీసులు జారీ అయ్యాయి. బ్లడ్ శాంపిళ్లలో పాజిటివ్ వచ్చిన వారికి ఈ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
హేమపై ఇటీవల నటి కరాటే కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేకాడితేనే హేమ నానా రచ్చ చేశారని, రేవ్ పార్టీలో పట్టుబడిన ఆమెకు శిక్ష తప్పదంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఆమెపై ‘మా’ చర్యలు తీసుకోవాలనే దిశగా టార్గెట్ చేశారు.
‘కన్నప్ప’లో విష్ణు బిజీ
కన్నప్ప సినిమాలో మంచు విష్ణు బిజీగా ఉన్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను ఆయన పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఎపిక్ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. కన్నప్ప చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ టీజర్ ప్రదర్శన ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగింది. జూన్ 13వ తేదీన ఈ టీజర్ రిలీజ్ చేస్తామని మంచు విష్ణు ఇటీవలే చెప్పారు. కన్నప్ప మూవీకి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోహన్ బాబు నిర్మిస్తున్నారు.