Sunday Motivation: మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి చాలు, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది

Best Web Hosting Provider In India 2024

Sunday Motivation: కోపం… రెండక్షరాల చిన్న పదం. కానీ ఒక జీవితాన్ని నాశనం చేయడానికి అదే మూలం. రెండు నిమిషాల గొడవ ఒక నిండు జీవితాన్ని బలి చేస్తుంది. కోపంతో పుట్టిన కక్ష ఒక కుటుంబాన్ని బలి కోరుతుంది. కోపం అనేది ఎదుటివారి జీవితాన్నే కాదు, మీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కోపాన్ని ఆయుధంలా కాదు, ఆలోచనగా మార్చుకోవాలి.

బాధనుండి పుట్టేదే కోపం. ఆ బాధను తీర్చుకుంటే కోపం తగ్గుతుంది అనుకుంటారు. మీ బాధను తీర్చుకునేందుకు ఎదుటివారిని బాధ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల వారితో పాటు మీరు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి కోపాన్ని ఎంత నియంత్రణలో ఉంచుకుంటే… మీతో పాటు సమాజం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది.

కోపం అనేది ఒక సహజమైన భావోద్వేగం. కొందరికి అది అదుపులో ఉంటుంది. అలాంటివారు జీవితాంతం ఎలాంటి చిక్కుల్లో పడకుండా ప్రశాంతంగా ఉంటారు. మరికొందరిలో అదుపు తప్పుతుంది. వారే క్రిమినల్స్ గా మారతారు. హంతకులుగా మారి ఎదుటివారి ప్రాణాన్ని తీస్తారు లేదా తమ ప్రాణాన్ని తీసుకుంటారు. అలా రెండు కుటుంబాలకు క్షోభను మిగులుస్తారు. రెండు నిమిషాల పాటు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు ప్రాణాలు నిలబడతాయి. రెండు కుటుంబాల్లో వెలుగులు విరజిల్లుతాయి.

కోపం కారణంగా జైల్లో పడి మగ్గుతున్న వారి సంఖ్య ఎంతో ఎక్కువ. వారిని కలిసి మాట్లాడితే తెలుస్తుంది… కోపం వల్ల జరిగే నష్టం. వారు రెండు నిమిషాలు తమను తాము కంట్రోల్ చేసుకుని ఉంటే కుటుంబంతో హాయిగా జీవించే వారు… అని పశ్చాత్తాపంలో మగ్గిపోతుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కోపాన్ని ఎంతగా అదుపులో పెట్టుకుంటే అంత మంచిది.

కోపమనేది పాతికేళ్ల యువతలోనే కాదు, రెండేళ్ల పిల్లల్లోనూ వస్తుంది. పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు. కానీ పెద్దవాళ్ళు కోపానికి కొత్త రూపాలను అందిస్తారు. ఎదుటివారికి బాధలను మిగులుస్తారు. తమ కుటుంబానికి కూడా తీవ్ర నష్టం జరిగేలా చేస్తారు. కోపం వచ్చినప్పుడు ఏమైనా మీరు ఎంతగా కంట్రోల్ చేసుకుంటే అంత మంచిద.

పురాణాల్లో దూర్వాసుడని మహాముని ఉండేవాడు. అతడు ఎంతో గొప్ప రుషి. కానీ కోపం ఎక్కువ చాలు. అతని వ్యక్తిత్వం గొప్పదైనా కూడా కేవలం కోపమనే దుర్గుణం వల్ల అతనికి చెడ్డ పేరు మిగిలింది.

మనకు నచ్చని సంఘటన జరిగినప్పుడు మన మెదడులో ఉండే ఒక భాగం రియాక్షన్ చూపిస్తుంది. ఆ రియాక్షనే భావోద్వేగం. వెంటనే శరీరంలో అడ్రినల్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు అడ్రినలిన్ రక్తంలోకి ఎక్కువ మోతాదులో పంప్ అవుతుంది. అప్పుడు కోపం తీవ్రత పెరుగుతుంది. ఆ సమయంలోనే మనుషులు తీవ్రంగా అరవడం, కోప్పడడం చేస్తారు. విచక్షణ కూడా కోల్పోతారు.

అలాగే మెదడులో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చే వ్యవస్థ కూడా ఉంది. అదే పారాసింపాథిటిక్ నెర్వస్ సిస్టం. ఇది పరిస్థితిని సాధారణంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కాసేపటికి ఆ కోపం తగ్గుతుంది. కానీ ఆ సమయం కూడా కొంతమంది మెదడుకు ఇవ్వరు. ఆ రెండు నిమిషాల్లోనే తీవ్రంగా నష్టపోయే పనులు చేస్తారు. కోపం వచ్చినప్పుడు ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు కోపాన్ని అణచుకోండి. మీ మెదడులోని పారాసింపాథెటిక్ నెర్వస్ సిస్టం యాక్టివ్ అవుతుంది. కోపాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది.

కోపం అదుపులోనే ఉండాలంటే ఏదైనా పని చేసే ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించండి. లేదా అంకెలు లెక్క పెట్టండి. కోపమనేది సంతోషం లాగే ఒక ఉద్వేగం. అది కొన్ని క్షణాలు పాటు మాత్రమే ఉంటుంది. ఆ క్షణాల పాటు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకుంటే పరిస్థితి మామూలు అయిపోతుంది. ప్రతిసారి మీరే గెలవాలని అనుకోవద్దు. కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని గెలవనీయకుండా చేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు మీ ముందున్న జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ఒక్క ఓటమి వలన మీ జీవితం ఆగిపోదని అర్థం చేసుకోండి. కోపం అధికంగా వస్తున్నప్పుడు ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోండి. కోపం వచ్చినప్పుడు మీరు ఎదుటివారికి చేసే గాయం మీ జీవితానికి కూడా తీరని నష్టాన్ని కలిగిస్తుందని గుర్తు చేసుకోండి. మీతో పాటు మీ కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుందని తెలుసుకోండి. కాబట్టి ఎవరి మీద మీకు కోపం ఉంటుందో వారు కనిపించని ప్రదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఆటోమేటిక్ గానే కోపం రావడం తగ్గుతుంది.

యోగా, ధ్యానం వంటివి ఎలానూ ఉన్నాయి. శ్వాస వ్యాయామాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. పాజిటివ్ థింకింగ్ కు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. కోపం వల్ల మీకు ఒరిగేది ఏమీ లేదు… జీవితంలో నష్టపోవడం తప్ప.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024