Best Web Hosting Provider In India 2024
Telangana cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతోంది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం ఉండాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించాక… గతేడాది డిసెంబరు 9వ తేదీన అధికారం చేపట్టింది. ఇదే తేదీన సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఈ సంఖ్య 12గా ఉంది. మరో ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… కీలక నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం…. ఎన్నికలపై ఫోకస్ పెట్టింది.
జూన్ 4వ తేదీతో ఎన్నికల ఫలితాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. కేబినెట్ విస్తరణ ప్రక్రియను ఆగస్టు 15వ తేదీలోపు పూర్తి చేసి… పూర్తిస్థాయి టీమ్ తో ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
విస్తరణలో ఎవరికి అవకాశం…?
మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పించాల్సి ఉంటుందన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుత మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు ఉండగా… ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. అయితే విస్తరణలో కూడా సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.
తెరపైకి కొత్తపేర్లు…?
తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జి. వివేక్, ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. అయితే ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మధన్ మోహన్ రావు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లా నుంచి ఒకరికి బెర్త్ ఖరారయ్యే అవకాశం దాదాపుగా ఉంటుంది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. అయితే ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేబినెట్ బెర్త్ ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలిస్తోంది.
మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ కోణంలో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్టీ సామాజికవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యేతో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్ నేతలు కావటంతో…. వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుత కేబినెట్ లో మైనారీవర్గాలకు చెందిన మంత్రి లేరు. దీంతో విస్తరణలో తప్పకుండా మైనార్టీ కోటా నుంచి ఒకరికి ఛాన్స్ దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పలువురు ఎమ్మెల్యేలు వస్తారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వారిలో నుంచి ఒకరికి బెర్త్ దక్కవచ్చన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది. కొత్త, పాత జోడితో పూర్తిస్థాయి తెలంగాణ కేబినెట్ కొలవుదీరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లోనే వీటిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…!
టాపిక్