Best Web Hosting Provider In India 2024
Palakura Uthappam: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహారంలో భాగం చేసుకోమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూనే ఉంటారు. అయితే దాని రుచి పచ్చిగా ఉంటుంది, కాబట్టి ఎంతో మంది తినరు. ముఖ్యంగా పిల్లలు పాలకూరతో చేసిన వంటకాలు తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి పాలకూర ఊతప్పం వంటివి చేసి పెడితే మంచిది. ఇక్కడ పాలకూర ఊతప్పం రెసిపీ ఇచ్చాను. దీన్ని చేయడం చాలా సులువు. ఇది కాస్త గ్రీన్ కలర్ లో వస్తుంది. కాబట్టి పిల్లలకు ఆసక్తికరంగా అనిపిస్తుంది. పాలకూర ఊతప్పం కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి.
పాలకూర ఊతప్పం రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర – మూడు కట్టలు
బియ్యం – మూడు కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
టమాటో ప్యూరీ – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
క్యాప్సికం – ఒకటి
మిరియాల పొడి – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
కారం – అర స్పూను
చీజ్ – అరకప్పు
పాలకూర ఊతప్పం రెసిపీ
1. బియ్యం, మినప్పప్పు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
2. వాటిని రెండింటినీ రుబ్బుకొని, ఉప్పు కలిపి రాత్రంతా వదిలేయాలి.
3. ఆ పిండి బాగా పులుస్తుంది. ఉదయం లేచాక మరొకసారి ఆ పిండిని బాగా కలుపుకోవాలి.
4. పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి కాస్త నూనె వేయాలి.
6. అందులోనే పాలకూరను వేసి బాగా మగ్గించాలి. పచ్చివాసన పోయే వరకు ముగించుకోవాలి.
7. దాన్ని మిక్సీలో మెత్తగా చేసి ఆ పేస్టును కూడా ఈ రుబ్బులో కలిపేయాలి.
8. అలాగే టమాటాలను ప్యూరీలా మార్చి ఈ పేస్ట్ లో కలిపి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పెనం పెట్టి నూనె వేసుకోవాలి.
10. ఈ పిండిని ఊతప్పం లాగా దళసరిగా వేసుకోవాలి.
11. రెండు వైపులా కాల్చుకోవాలి.
12. పైన తరిగిన క్యాప్సికం, చీజ్ ను వేసుకోవాలి. అంతే పాలకూర ఊతప్పం రెడీ అయినట్టే.
13. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
పాలకూర ఊతప్పం పిల్లలకే కాదు పెద్దలకు కూడా నచ్చుతుంది. పాలకూరలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఎప్పుడూ ఇష్టంగా పాలకూరను తినని పిల్లలు… ఈ పాలకూర ఊతప్పాన్ని ఇష్టంగా తింటారు. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. ఇది చాలా కొత్తగా ఉంటుంది.
టాపిక్