Jaya Jayahe Telangana : రాష్ట్ర గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు ఆమోదం – 2 వర్షన్లలో పాట, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy News : ’జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు.

ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు.

సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  సమీక్షించారు.ఇందుకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు.  ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి ఇందులో పాల్గొన్నారు.

దశాబ్ధి ముగింపు వేడుకలపై చర్చ….

తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. 

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది.

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్

HyderabadCm Revanth ReddyTelangana NewsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024