Best Web Hosting Provider In India 2024
Maharaja Trailer: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి 50వ సినిమాగా వస్తోంది మహారాజ. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ గురువారం (మే 30) రిలీజ్ చేశారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేసిన విజయ్.. ఇప్పుడు ట్రైలర్ లో తనదైన స్టైల్ నటనతో అదరగొట్టేశాడు. తన ఇంట్లో నుంచి కనిపించకుండా పోయిన లక్ష్మిని వెతికే పనిలో అతడు ఉన్నాడు.
మహారాజ ట్రైలర్
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమా కావడం ఈ మహారాజకు ఉన్న మరో ప్రత్యేకత. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. ఒక నిమిషం 42 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ లో విజయ్ టైటిల్ పాత్రను పోషించినట్లు చూపించారు. తన పేరు మహారాజ అని, తానో సెలూన్ షాప్ పెట్టుకున్నానని, తన ఇంట్లో నుంచి లక్ష్మిని ఎవరో దొంగిలించారంటూ పోలీస్ స్టేషన్ కు వస్తాడు విజయ్ సేతుపతి.
ఆ లక్ష్మి ఎవరు? ఎవరు దొంగిలించారన్నది మాత్రం ట్రైలర్ లో ఎక్కడా చెప్పలేదు. లక్ష్మి ఓ మనిషి కాదని మాత్రం ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఆమె ఎవరు అని ఎంతమంది అడిగినా.. సైగల ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా చెప్పినట్లు ట్రైలర్ లో చూపించలేదు. ఈ పాయింటే సినిమాపై ఆసక్తి రేపేలే చేస్తోంది. మహారాజ భార్య, చెల్లి, స్నేహితురాలు కాని ఆ లక్ష్మి ఎవరన్నది సినిమా చూస్తేనే తెలియనుంది.
అయితే ఓ సాధారణ బార్బర్ ఇంట్లో అంత పెద్ద క్రైమ్ ఎందుకు జరిగిందన్నది కూడా మూవీలో ఆసక్తికరమైన పాయింటే. అతని ఫ్లాష్ బ్యాక్ సినిమా అసలు కథను వెల్లడించనుంది.
విజయ్ సేతుపతి మార్క్..
తమిళంలో విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది. భిన్నమైన కథలతో సినిమాలు చేయడం, తన నటనతో అదరగొట్టడం అతనికి అలవాటు. ఇప్పుడీ మహారాజ మూవీలోనూ అతడు అదే చేసినట్లు కనిపిస్తోంది. ట్రైలర్ లో అతడు తన చెవికి కట్టుతో కనిపించడం, అతని ఇంట్లో ఏదో పెద్ద ఘటనే జరిగినట్లుగా ఉందన్న పోలీసుల డైలాగ్ చూస్తుంటే మూవీలో సస్పెన్స్ బాగానే ఉన్నట్లుగా అనిపిస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా నటించాడు. ఇందులో అతడు విలన్ పాత్ర పోషించడం విశేషం. ట్రైలర్ లో ఒక్క సీన్లో మాత్రమే అతన్ని చూపించారు. ఇక చాలా రోజుల తర్వాత మమతా మోహన్‌దాస్ కూడా ఇందులో నటించింది. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అని మాత్రమే ట్రైలర్ లో చెప్పారు.
ఈ ఏడాది మెర్రీ క్రిస్మస్ అనే మూవీ తీసినా.. విజయ్ కు అది నిరాశనే మిగిల్చింది. కత్రినా కైఫ్ తో కలిసి నటించిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు మహారాజతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరో సినిమా ఏసీఈలోనూ అతడు నటిస్తున్నాడు. ఆ సినిమా టీజర్ కూడా ఈ మధ్యే రిలీజైంది.