Best Web Hosting Provider In India 2024
Silver Coins Found in Siddipet District : సిద్దిపేట జిల్లాలో పురాతన నాణేలు బయటపడ్డాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలు ఓ పొలంలో పనులు చేస్తుండగా వారికి ఒక రాయితో చేసిన పెట్టె కనిపించింది. ఆ పెట్టెని తెరిచి చూడగా దానిలో 350 సంవత్సరాల క్రితం ముద్రించిన ఆరో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండితో చేసిన ఉంగరాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామంలో జరిగింది.
25 వెండి నాణేలు,రెండు వెండి ఉంగరాలు ……
వివరాల్లోకి వెళ్తే…. సిద్దిపేట జిల్లా నర్సాయిపల్లి గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులలో భాగంగా కూలీలు చల్లా మల్లారెడ్డి పొలంలో చదును చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఓ కూలీ తవ్వుతుండగా భూమిలో రాతితో చేసిన ఒక పెట్టె దొరికింది. ఆ కూలీ విషయం ఎవరికి చెప్పకుండా పెట్టెను తమ ఇంటికి తీసుకొని వెళ్ళింది.
కొందరు కూలీలు ఆ విషయాన్నీ గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గురువారం ఆమె ఇంటికి వెళ్లి పెట్టెను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఆ పెట్టెలో 25 వెండి నాణేలు,రెండు వెండి ఉంగరాలు ఉన్నాయని తెలిపారు. పురాతన కాలం నాటి నాణేలని ఊర్లో తెలియడంతో ప్రజలు వాటిని చూడడానికి గుంపులుగా ఎగబడ్డారు. ఆ నాణేల పెట్టెను పురావస్తుశాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
దొరికిన నాణేలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రీ.శ.1670- క్రీ.శ.1690 మధ్యకాలంలో ముద్రించబడిన నాణేలని చరిత్రకారుడు బి. వి. భద్రగిరిష్ చెప్పారు. ఈ నాణేలన్నీ ఒక రూపాయి నాణేలని.. వాటిని సూరత్, జఫ్రాబాద్, గోల్కొండ లో ముద్రించబడినవని ఆయన తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ పట్టణం పేరు ఔరంగజేబు పాలనలో జఫ్రాబాద్ గా ఉండేదని వివరించారు.
బందిపోట్ల కంట పడొద్దనే….
ఆ కాలం నాటి ప్రజలు… దొంగలు, బందిపోట్ల నుండి రక్షించుకోవడానికి బంగారం, వెండితో చేసిన నాణేలను, ఇతర విలువైన వస్తువులను భూమిలో పాతిపెట్టేవారని చరిత్రకారుడు తెలిపారు. ఆ పాతి పెట్టిన విషయాన్ని… ఆ వ్యక్తి తన కుటుంబసభ్యులతో పంచుకోకపోవడంతో అది ఇప్పటివరకు ఎవరికీ దొరకలేదని అయన అభిప్రాయపడ్డారు.
350 సంవత్సరాల క్రితం భూమిలో దాచిపెట్టిన నాణేలు ఇప్పుడు బయటపడ్డాయి. ఆ నాణేలకు ఒకవైపు పర్షియన్ భాషలో ఔరంగజేబు అలంగీర్ బాద్షా అని, మరోవైపు ఖురాన్ పద్యాలు వ్రాయబడి ఉండటాన్ని చరిత్రకారులు గుర్తించారు. అలంగీర్ అంటే ప్రపంచాన్ని జయించినవాడు అనే అర్ధం వస్తుంది. అది ఔరంగజేబు బిరుదు. ఆ నాణేలు ఒక్కొక్కటి 11. 36 గ్రాముల బరువున్నట్లు పురావస్తు నిపుణులు తెలిపారు.
అప్పట్లో ప్రజలు నాణేలను ఉంగరాలపైన ధరించేవారని, అందుకే ఆ డబ్బాలో నాణాలతో పాటు ఉంగరాలు కూడా లభ్యం అయ్యాయి అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
రిపోర్టింగ్ – మెదక్ జిల్లా ప్రతినిధి,HT తెలుగు.
టాపిక్