Best Web Hosting Provider In India 2024
TG Formation Day celebrations 2024: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు.
అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత… తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను పాటను రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలందించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసిన సోనియాగాంధీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
“బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని హరిస్తే తెలంగాణ సహించదు. ముళ్ల కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలనను ప్రజల దగ్గరకు తెచ్చాం. సచివాలయంలోకి సామాన్యుడు వచ్చేలా చేశాం. ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసుకునేందుకు అనుమతిచ్చాం. పత్రి పక్షాలకు గౌరవం ఇచ్చాం” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
సోనియా గాంధీ ప్రత్యేక సందేశం….
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. అమరవీరుల త్యాగాలను ఆమె గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేర్చామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుందని హామీనిచ్చారు.
ఇక సాయంత్రానికి ట్యాంక్ బండ్ పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి సాయంత్రం ఆరున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, అధికారులు హాజరవుతారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ సంస్కతి,సంప్రదాయాలు అద్దం పట్టేలా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, ఫుడ్ స్టాళ్లు, రేవంత్ రెడ్డి సందర్శిస్తారు.
అనంతరం 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు హాజరు కానున్నారు. దీని తరువాత ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టేజ్ పై నిమిషం పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. అనంతరం ట్యాంక్ బండ్ పై 5 వేల మంది జాతీయ పథకంతో భారీ ఫ్లాగ్ వాక్ చేయనున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధికారిక గేయం జయజయహే తెలంగాణ పాటను ప్రదర్శిస్తారు. అనంతరం ఈ పాటలో భాగం పంచుకున్న అందె శ్రీ, కీరవాణి సన్మానం చేస్తారు.
టాపిక్