Best Web Hosting Provider In India 2024
Temple For Parents at Akkannapet : నేటి సమాజంలో జన్మనిచ్చిన తల్లితండ్రులకు వృధాప్యంలో పట్టెడ్డన్నం పెట్టకుండా వారిని అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు. తల్లితండ్రులు సంపాదించిన ఆస్తులు తీసుకొని వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటనలు సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి రోజుల్లో తల్లిదండ్రులపై కుమారులు విభిన్నంగా ప్రేమను చాటుకున్నారు.
తల్లిదండ్రులకు గుడి….
సిద్దిపేట జిల్లాకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు కలిసి తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం గుడి కట్టించారు. వారి వర్ధంతి వేడుకలను బంధువుల మధ్య వైభవంగా జరిపించారు. ఈ నిర్మాణం అక్కన్నపేట మండల కేంద్రంలో జరిగింది.
అక్కన్నపేట గ్రామానికి చెందిన గొట్టే కనకయ్య,కొమరవ్వ దంపతులకు సదయ్య, మహేందర్, చిరంజీవి అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. వీరిలో సదయ్య, మహేందర్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా చిరంజీవి సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
వీరి తల్లి కొమరవ్వ నాలుగేండ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా… సంవత్సరం క్రితం తండ్రి కనకయ్య పాముకాటుతో మరణించాడు. అయితే తమ తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమంగా చూసుకున్నారని గుర్తు చేసుకుంటూ… వారిపై ప్రేమను చాటుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. తమ కళ్ళ ముందు తల్లిదండ్రులు ఎల్లప్పుడు సజీవంగా కదలాడేట్టు ఉండాలని ముగ్గురు అన్నదమ్ములు కలిసి వారికి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నారు.
బావి దగ్గర నిర్మాణం…..
ముగ్గురు కుమారులు కలిసి తల్లితండ్రుల విగ్రహాలను తయారు చేయించారు. ఆ ఇద్దరి విగ్రహాలను తమ వ్యవసాయ బావి వద్ద గుడి కట్టి అందులో ప్రతిష్టించారు. అనంతరం తండ్రి కనకయ్య ప్రథమ వర్ధంతి,తల్లి కొమరవ్వ నాల్గొవ వర్ధంతికి బంధువులను, స్నేహితులను ఆహ్వానించి ఘనంగా నిర్వహించారు. అనంతరం బంధుమిత్రుల సమక్షంలో విగ్రహాలను ఆవిష్కరించి…. గుడిలో తల్లితండ్రులకు పూజలు చేసి వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు.
రిపోర్టింగ్ – మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.
టాపిక్