Best Web Hosting Provider In India 2024
Indian 2 Movie: తమిళ సీనియర్ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 (భారతీయుడు 2) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 28 సంవత్సరాల క్రితం 1996లో వీరి కాంబోలో వచ్చిన ఇండియన్ చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ అవడంతో పాటు ఐకానిక్ మూవీగా నిలిచింది. ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఇండియన్ 2 వస్తోంది. దీంతో ఈ చిత్రానికి ఫుల్ హైప్ ఉంది. ఈ సినిమా జూలై 12వ తేదీన విడుదల కానుంది. ఈ తరుణంలో ఇండియన్ 2 మూవీ ఆడియోను మూవీ టీమ్ లాంచ్ చేసింది. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది.
ఇండియన్ 2 మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో దర్శకుడు శంకర్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ మూవీ కోసం కమల్ హాసన్ చేసిన కృషిని వివరించారు.
మేకప్‌తో 70 రోజులు
భారతీయుడు 2 కోసం భారీ మేకప్‌తో 70 రోజుల పాటు కమల్ హాసన్ షూటింగ్ చేశారని, ఇది మామూలు విషయం కాదని డైరెక్టర్ శంకర్ చెప్పారు. ప్రపంచంలోనే కమల్ లాంటి నటుడు మరెవరూ లేరని ఆయన చెప్పారు. “ఇండియన్ 2 షూటింగ్లో మొదటి రోజు కమల్ హాసన్ గెటప్ చూసి అందరం షాక్ అయ్యాం. 28 ఏళ్ల కిందట ఎలా అనిపించిందో.. అదే ఫీలింగ్ కలిగింది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం మామూలు విషయం కాదు. కమల్ 360 డిగ్రీలకు మించి అన్ని కోణాల్లో నటించగలిగే యాక్టర్. కమల్ లాంటి యాక్టర్ ప్రపంచంలో మరెవరూ లేరు. 70 రోజుల పాటు మేకప్‌తోనే ఆయన నటించారు” అని డైరెక్టర్ శంకర్ చెప్పారు.
ఇండియన్ 2 చిత్రంలో సేనాపతి క్యారెక్టర్ చేసిన కమల్ హాసన్.. వృద్ధుడి గెటప్ కోసం గంటల పాటు మేకప్ వేసుకునే వారు. అంతటి భారీ మేకప్‌తోనే రోజుల పాటు షూటింగ్ చేశారు.
కాజల్ విషయంలో ఈ నిరాశ
ఇండియన్ ప్రాజెక్టులో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటించారు. అయితే, ఇండియన్ 2లో కాజల్ కనిపించరని, ఇండియన్ 3 చిత్రం ఆమె పాత్ర ఉంటుందని డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. దీంతో ఇండియన్ 2 మూవీలో కాజల్‌ను చూడాలని వేచిచూస్తున్న ఆమె అభిమానులకు నిరాశ ఎదురైంది.
ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబి సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం వహించారు. ఆడియో లాంచ్‌లో అన్ని పాటలను మేకర్స్ రిలీజ్ చేశారు. అంతకు ముందే రెండు పాటలు రాగా.. ఇప్పుడు అన్నీ విడుదలయ్యాయి. ఇండియన్ 2 చిత్రం జూలై 12వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మళ్లీ గతేడాదిలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కింది. ఇండియన్ 3 కూడా తీసుకురావాలని శంకర్ డిసైడ్ అయ్యారు. ఎట్టకేలకు ఇండియన్ 2 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.