Best Web Hosting Provider In India 2024
Medchal Crime : ఓ మహిళ దారుణంగా హత్యకు గురైన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ మల్లిఖార్జున నగర్ లో ఓ ఇంట్లో సత్యనారాయణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి గత కొన్నేళ్లుగా కిరాయి ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే వచ్చి పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే శనివారం సత్యనారాయణ కిరాయి ఉండే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వాళ్లు వెళ్లి చూడగా….మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా…..మహిళను దారుణంగా కాళ్లు, చేతులు కట్టేసి ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి, ఛార్జింగ్ వైర్ తో గొంతు బిగించినట్టు పోలీసులు గుర్తించారు. మహిళ మృతదేహం కొంత భాగం కుల్లిపోయినట్టు గుర్తించారు. చుట్టు పక్కల లభించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. అయితే హత్యకు గురైన మహిళ వయసు సుమారు 50 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇక ఆ మహిళ ఎవరు? అక్కడికి ఎందుకు వచ్చారు? రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణకు ఆ మహిళకు ఉన్న సంబంధం ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అన్ని కోణాల్లో విచారించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి వెల్లడించారు.
మేడ్చల్ లో లారీ కింద పడి వ్యక్తి మృతి
లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ములుగు జిల్లాకు చెందిన వెంకటేశ్ మేడ్చల్ పట్టణంలోని రాయల్ సిలికాన్ క్వారీలో పని చేస్తున్నాడు. క్వారీ పని తర్వాత వెంకటేష్ ఓ లారీ కింద పడుకున్నాడు. అది గమనించని లారీ డ్రైవర్, లారీని స్టార్ట్ చేసి రివర్స్ తీసే ప్రయత్నం చేయగా…..వెంకటేష్ తలపై నుంచి లారీ వెళ్లింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం-హోంగార్డు మృతి
బోర్ వెల్ వాహనం ఢీ కొట్టడంతో హోంగార్డు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం……ఉప్పల్ హిల్స్ కురుమ నగర్ ప్రాంతానికి చెందిన మొగుళ్ల లింగయ్య (48) సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్న ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతూ ఉండగా….రామంతాపూర్ ప్రగతి నగర్ కమాన్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి నిర్లక్ష్యంగా వచ్చిన ఓ బోర్ వెల్ వాహనం లింగయ్య బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లింగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా స్థానిక ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం
టాపిక్