Best Web Hosting Provider In India 2024
Panasa Dosa: పనస పండు వాసనకి నోరూరిపోతుంది. ఆ పనస తొనలతో దోశెను చేస్తే రుచి మాములుగా ఉండదు.ఇది తియ్యగా, యమ్మీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. టేస్టీ పనస దోశను కర్ణాటకలోని మలినాడు అనే ప్రాంతంలో చేస్తూ ఉంటారు. ఇది అక్కడ సాంప్రదాయ వంటకం. వేసవిలో కచ్చితంగా చేసుకొని తింటారు. ఇక్కడ ఇచ్చిన రెసిపీని ఫాలో అయితే మీరు కూడా సులువుగా పనస దోశను చేయొచ్చు.
పనస దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
పనస తొనలు – ఏడు
బెల్లం – పావు కప్పు
నీరు – తగినంత
నూనె – రెండు స్పూన్లు
పనస దోశ రెసిపీ
1. కప్పు బియ్యాన్ని కనీసం నాలుగు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పనస తొనలను వేరుచేసి విత్తనాలను తొలగించాలి.
3. ఆ పనస గుజ్జును నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. అందులో కాస్త బెల్లం కూడా వేసి రుబ్బాలి.
5. అవసరమైనంత నీటిని చేర్చాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
6. దోశ పిండి మందానికి వచ్చేవరకు నీటిని కలుపుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి.
8. ఈ పిండిని దోశల్లాగా వేసుకోవాలి.
9. రెండు వైపులా గోధుమ రంగులోకి వచ్చేవరకు కాల్చుకోవాలి. తర్వాత తీసి సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ పనస దోస రెడీ అయిపోతుంది.
10. దీన్ని తినడానికి చట్నీ అవసరం లేదు. ఇది చాలా తీపిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది మంచి బ్రేక్ ఫాస్ట్ రెసిపీ.
పనసపండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పనసపండు తరచూ తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో గుండెపోటును దూరం చేసే శక్తి పనస పండుకి ఉంది. ఆస్తమా ఉన్నవారు పనసపండును తినవచ్చు. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే పిల్లలు, మహిళలు ఖచ్చితంగా పనస తొనలను తినాలి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.
పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. పనసలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తిని రోగనిరోధక వ్యవస్థకు అందిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా పనస దోశను చేసుకొని తినండి. ముఖ్యంగా పిల్లలకు ఇది కొత్త రుచులు అందిస్తుంది. ఒక్కసారి దీన్ని చేసి చూడండి. మీ పిల్లలకు ఇది నచ్చడం ఖాయం.