Best Web Hosting Provider In India 2024
Heeramandi Season 2: హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలుసు కదా. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ.. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ఇప్పుడు రెండో సీజన్ కూడా వస్తోందట. ఈ విషయాన్ని భన్సాలీయే వెల్లడించాడు.
హీరామండి సీజన్ 2
హీరామండి వెబ్ సిరీస్ చాలా గ్రాండ్ గా తీశారు. దీంతో ఇలాంటి సిరీస్ మళ్లీ సాధ్యమేనా? దీనికి సీక్వెల్ తీస్తారా అని చాలా మంది సందేహించారు. నిజానికి భన్సాలీ కూడా గతంలో మాట్లాడుతూ.. “ఇలాంటి వెబ్ సిరీస్ కేవలం ఒకేసారి సాధ్యమవుతుంది. ఇలాంటి మళ్లీ ఎవరూ తీయలేరు. నేను కూడా” అని అన్నాడు. కానీ తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో అతడే సీజన్ 2ను కన్ఫమ్ చేశాడు.
వెరైటీ మ్యాగైజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భన్సాలీ మాట్లాడాడు. హీరామండి వెబ్ సిరీస్ కోసం తాను ఎంతలా కష్టపడిందీ వివరించాడు. “ఓ సిరీస్ తీయాలంటే చాలా శ్రమ అవసరం. ఇది మరింత ఎక్కువ శ్రమ తీసుకుంది. ఫిబ్రవరి, 2022లో గంగూబాయి రిలీజైన తర్వాత ఇప్పటి వరకూ నేను ప్రతి రోజూ బ్రేక్ తీసుకోకుండా దీనిపైనే పని చేశాను. అందువల్ల ఈ సిరీస్ కోసం చాలా బాధ్యత నాపై ఉండేది” అని భన్సాలీ చెప్పాడు.
రెండో సీజన్‌కు బాలీవుడ్ లింక్
ఇదే ఇంటర్వ్యూలో భన్సాలీ రెండో సీజన్ ను కూడా కన్ఫమ్ చేశాడు. హీరామండిలోని వాళ్లంతా ఇప్పుడు లాహోర్ నుంచి సినిమా ప్రపంచంలోకి రాబోతున్నట్లు అతడు చెప్పడం విశేషం. “హీరామండి 2లో ఈ వేశ్యలు లాహార్ వదిలి సినిమా ప్రపంచంలోకి వస్తారు. దేశ విభజన తర్వాత వాళ్లలో చాలా మంది ముంబై లేదా కోల్‌కతా ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సెటిలవుతారు.
అందువల్ల బజార్ లో ప్రయాణం అలాగే ఉంటుంది. ఇప్పుడూ వాళ్లు డ్యాన్స్ చేస్తారు. పాడుతూనే ఉంటారు. కానీ ఈసారి నవాబుల కోసం కాకుండా ప్రొడ్యూసర్ల కోసం చేస్తారు. రెండో సీజన్ అలా ప్లాన్ చేస్తున్నాం. అది ఎప్పుడవుతుందో చూడాలి” అని భన్సాలీ అన్నాడు.
నిజానికి హీరామండి సీజన్ 2ను ముంబైలోనే అనౌన్స్ చేశారట. 100 మంది అనార్కలి డ్రెస్సుల్లో ఉన్న ఫ్లాష్ మాబ్ లో దీనిని అనౌన్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వీపీ మోనికా షెర్గిల్ కూడా హీరామండి సీజన్ 2ను కన్ఫమ్ చేశారు. తొలి సీజన్ కు ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, అందుకే రెండో సీజన్ తీసుకొస్తున్నట్లు తెలిపారు.
హీరామండి వెబ్ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, సంజీదా షేక్, అదితి రావ్ హైదరీ, షర్మిన్ సేగల్, ఫర్దీన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. తన సినిమాలలాగే ఈ వెబ్ సిరీస్ ను కూడా భన్సాలీ చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. రూ.200 కోట్లకుపైగా బడ్జెట్ తో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సిరీస్ గా నిలిచింది. మరి రెండో సీజన్ ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో చూడాలి.