Best Web Hosting Provider In India 2024
Pawan Kalyan – OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని ‘జనసేన’ పార్టీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు దక్కించుకుంటోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. నేడు (జూన్ 4) ఓట్ల లెక్కింపు జరుగుతోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో మధ్యాహ్నం నాటికి అన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాసేపట్లో తుది ఫలితాలు వెల్లడవుతాయి. గత 2019 ఎన్నికల్లో జనసేనకు నిరాశాజనక ఫలితాలు రాగా.. ఈసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా నుంచి మూవీ టీమ్ ఓ పవర్ఫుల్ పోస్టర్‌ను నేడు (జూన్ 4) రిలీజ్ చేసింది.
పవర్‌ఫుల్‌గా..
ఓజీ టైమ్ మొదలైంది అంటూ ఈ మూవీని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ నేడు పోస్టర్ రిలీజ్ చేసింది. ఫైర్ ఉన్న కుర్చీపై స్టైలిష్‌గా పవన్ కల్యాణ్ కూర్చున్నట్టు ఈ పోస్టర్ ఉంది. పవర్‌ఫుల్‌గా ఈ పోస్టర్ కనిపిస్తోంది. “ఎవ్వరికి అందదు అతని రేంజ్.. రెప్ప తిరిచెను రగిలే రివేంజ్” అంటూ గ్లింప్స్‌లో ఉన్న లైన్స్ రాసుకొచ్చింది ఓజీ టీమ్.
2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఆ పార్టీకి ఒకే సీటు దక్కింది. అయినా పవన్ కల్యాణ్ ఏ మాత్రం నిరాశచెందకుండా ఐదేళ్లుగా పోరాడారు. వీలైనంత మేర ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు జనసేన అద్భుత ఫలితాలు సాధించగా.. ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో పవన్ గెలుపు ఖరారైంది. కాసేపట్లోనే తుది ఫలితాలు వెల్లడవుతాయి.
ఎన్నికల్లో జనసేన అదరగొట్టడంతో ఓజీ మూవీ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఈ నయా పోస్టర్ రిలీజ్ చేసింది. రగిలే రివేంజ్ అంటూ సందర్భానికి తగ్గట్టుగా క్యాప్షన్ పెట్టింది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
రిలీజ్ డేట్ లేకుండానే..
ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తామని మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. అయితే, వాయిదా పడుతుందనే రూమర్లు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో కొత్తగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో రిలీజ్ డేట్ లేదు. దీంతో సెప్టెంబర్ 27న ఈ చిత్రం రిలీజ్ అవుతుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది.
ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ కాస్త పెండింగ్‌లో ఉంది. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్లో పవన్ పాల్గొంటారనే అంచనాలు ఉన్నాయి.
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ పాత్ర పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయారెడ్డి, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది.
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ నిర్మాత ఏఎం రత్నం ఇటీవలే చెప్పారు.