Best Web Hosting Provider In India 2024
చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి కంటే మంచివాడిగా ముసుగు వేసుకునే వ్యక్తి చాలా ప్రమాదకరం. చెడు నుండి మనల్ని మనం కాపాడుకోగలం.., కానీ మంచిగా కనిపించే వారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు జ్ఞానం అవసరం. ఇందుకు చాలా తెలివి కావాలి. మంచివాడిగా ముసుగు వేసుకున్న వారి కొన్ని లక్షణాలను మనం గమనించినా.. వదిలేస్తాం. ఎందుకంటే వారిని పూర్తిగా నమ్మేస్తాం. నిజాలు తెలుసుకోలేం..
మంచిగా నటించేవారు.. మీతో మాట్లాడేటప్పుడు మీతో చాలా మంచిగా ప్రవర్తిస్తారు. మీరు వారిని చూసినప్పుడు మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, అయితే వారు ఇతరుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో మీరు చూడాలి. మనిషిగా కోపం, అసూయ అన్నీ సహజమే.. కానీ మంచివారమని ముసుగు వేసుకున్నావారితో జాగ్రత్త.
ఉదాహరణకు అమ్మాయిల విషయంలో చాలా మంది కుర్రాళ్లు.. నేను ఇతర కుర్రాళ్లలాగా కాదు అని డబ్బా కొడతారు. ఈ విషయం విన్న అమ్మాయిలు కచ్చితంగా అతడిని అనుమానించాలి. పదే పదే ఈ విషయం చెబుతున్నాడు అంటే కచ్చితంగా అతడు ముసుగు వేసుకున్నాడని అర్థం. ఎందుకంటే అతను అలా చెబుతూ మీరు నమ్మేలా చేస్తాడు. ఒక వ్యక్తి గురించి మీకు మంచి అభిప్రాయం ఉన్నా.. ఆ వ్యక్తి గురించి మరొకరికి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
ఒక మంచి మనిషి ముసుగు వేసుకుని చాలా మంది ప్రేమ నాటకం ఆడతారు. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి విషయాల్లోనే మోసపోతారు. అందంగా కనిపిస్తే చాలు అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత వారి అసలు రంగు బయటపడుతుంది.
ఏ వ్యక్తైనా మంచి స్వభావం కలిగి ఉంటే చాలా సహజంగా ఉంటారు. మిమ్మల్ని చూసుకునే విధానం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అనవసరమైన విషయాలు ఉండవు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని పొగడుతారు. ప్రతీసారి పొగిడితే మాత్రం కచ్చితంగా మంచివాడిలా నటిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు మీరు నమ్మే వ్యక్తిపై అనుమానం ఉంటే.. అతనికి తెలియకుండా అతని స్నేహితుల ద్వారా తెలుసుకోండి.
అందుకే జీవితంలో ఎవరితోనైనా ఎక్కడి వరకు ఉండాలో అక్కడికే ఉండాలి. అతిగా వెళ్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. నమ్మకం అనేది పునాదిలాంటిది. అయితే దీనిని సరిగా నిర్మించుకోవాలి. కేవలం పైపైన చూసి నమ్మకం పెంచుకుంటే ఏదో ఒకరోజు మిమ్మల్ని ముంచేసి వెళ్తారు. మంచి వ్యక్తిలాగా ముసుగు వేసుకున్నవారిని ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే వారు మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా చెప్తారు.
మంచివారిగా నటించేవారి ప్రవర్తనను కొన్ని సందర్భాల్లో గమనించండి. అది డబ్బు గురించి కావచ్చు, మీ స్నేహం గురించి కావచ్చు, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోండి. మిమ్మల్ని డబ్బు కోసం ఉపయోగిస్తున్నాడా లేదా అనేది కూడా అంచనాకు రావాలి. ఏ బంధంలోనైనా నిజాయితీ ముఖ్యం. అసలు మీరు మంచివాడు అనే వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా ముందు చెక్ చేయండి. ఆ తర్వాతే మీ బంధాన్ని ముందుకు వెళ్లనివ్వండి.