
Best Web Hosting Provider In India 2024

Maidaan OTT Streaming: భారీ బడ్జెట్, అంతకంటే భారీ అంచనాల మధ్య రిలీజైన మూవీ మైదాన్. అజయ్ దేవగన్ నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా రూ.235 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ చివరికి కేవలం రూ.65 కోట్ల వసూళ్లతో తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి మూవీని ప్రైమ్ వీడియో ఇన్నాళ్లూ రూ.399 రెంటల్ విధానంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఫ్రీగా మైదాన్ స్ట్రీమింగ్
అజయ్ దేవగన్, ప్రియమణి నటించిన మైదాన్ మూవీని ఇక నుంచి తమ సబ్‌స్క్రైబర్లందరూ ఫ్రీగా చూడొచ్చని ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. దీంతో త్వరగానే ఓటీటీలోకి తీసుకొచ్చినా.. ఇక్కడైనా కాస్త వసూలు చేద్దామని భావించి రెంటల్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు.
అయితే అది భారీ మొత్తం కావడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీంతో సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం హిందీలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. మిగతా భాషల్లో స్ట్రీమింగ్ గురించి ప్రైమ్ వీడియోలో ఏమీ చెప్పలేదు.
అసలేంటీ మైదాన్ మూవీ?
మైదాన్ మూవీ సయ్యద్ అబ్దుల్ రహీం అనే ఓ ఫుట్‌బాల్ కోచ్ బయోపిక్. ఈ సినిమాలో అజయ్ దేవగన్ ఈ రహీం పాత్రలోనే నటించాడు. ఇప్పుడంటే ఇండియన్ ఫుట్‌బాల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ కొన్ని దశాబ్దాల కిందట దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో మన టీమ్ ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫుట్‌బాల్ టీమ్స్ ను ఓడించిన విషయం ఎంతమందికి తెలుసు?
దానికి కారణం ఈ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం. అతడు పుట్టింది ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోనే. 1909లో జన్మించిన అబ్దుల్ రహీం.. మొదట్లో ఓ స్కూల్ టీచర్ గా పనిచేశారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్ గా ఎదిగారు. 1930ల్లో ఖమర్ క్లబ్, యురోపియన్ క్లబ్ హెచ్‌ఎస్వీ హొయెక్ లకు కొన్నాళ్లు ఆడారు. అయితే 1950లో హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్, ఇండియన్ నేషనల్ టీమ్స్ కు కోచ్ అయిన తర్వాతగానీ అబ్దుల్ రహీం పేరు మారుమోగలేదు.
అతడు కోచ్ అయిన తర్వాత పదేళ్ల పాటు ఇండియన్ ఫుట్‌బాల్ కు ఓ గోల్డెన్ ఎరాగా చెబుతారు. కోచ్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టును మూడుసార్లు డ్యురాండ్ కప్ విజేతగా, ఐదుసార్లు రోవర్స్ కప్ విజేతగా నిలిపాడు. అయితే నేషనల్ జట్టుతో మరిన్ని అద్భుతాలు చేశాడు.
రహీం కోచింగ్ లో ఇండియన్ టీమ్ ఏషియాలోనే బలమైన ఫుట్‌బాల్ జట్టుగా ఎదిగింది. 1951 ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ గెలిచింది. తర్వాత 1956 ఒలింపిక్స్ లో ఏకంగా సెమీఫైనల్ చేరింది. అప్పటి వరకూ ఇండియన్ టీమ్ కు ఇదే బెస్ట్ రిజల్ట్. తర్వాత 1960 ఒలింపిక్స్ లోనూ పాల్గొంది. ఇక 1962 ఏషియన్ గేమ్స్ లో మరో గోల్డ్ మెడల్ తో రహీం కోచ్ గా తప్పుకున్నాడు.