Best Web Hosting Provider In India 2024
Arun Govil MP: టీవీ రాముడు ఇప్పుడు ఎంపీ అయ్యాడు. మూడున్నర దశాబ్దాల కిందట వచ్చి ఇండియన్ టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రామాయణం సీరియల్లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ తాజా ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే తనను దేవుడిని చేసిన ఆ సీరియలే తన కెరీర్ ను దెబ్బతీయడం గమనార్హం. ఆ కథేంటో మీరూ చూడండి.
టీవీ రాముడి కెరీర్ ఇలా..
1987లో టీవీలో వచ్చిన రామాయణం సీరియల్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇప్పటికీ ఎక్కువ మంది చూసిన ఇండియన్ టీవీ షోగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సీరియల్లో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. టీవీలోనే కాదు బయటకు కూడా అతన్ని సాక్షాత్తూ విష్ణువు అవతారంగా, రాముడిగా చూడటం మొదలుపెట్టారు. బయట కనిపిస్తే చాలు కాళ్లు మొక్కి, పూజలు కూడా చేసేవాళ్లు.
అంతలా ఆ సీరియల్, ఆ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అంతకు పదేళ్ల ముందు నుంచే బాలీవుడ్, టీవీల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న అరుణ్ గోవిల్ ఈ ఒక్క పాత్రతో నేషనల్ స్టార్ అయిపోయాడు. అప్పటికి అతని వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే. తర్వాత ఎంతో కెరీర్ మిగిలి ఉంది. కానీ అదే రామాయణం సీరియల్ తన కెరీర్ ను దెబ్బ తీసిందని గతంలో ఓ సందర్భంలో గోవిల్ చెప్పాడు.
కెరీర్ గాడి తప్పింది ఇలా..
తనను దేవుడిని చేసిన ఇదే రామాయణం సీరియల్ అరుణ్ గోవిల్ కెరీర్ ను కూడా దెబ్బ తీసింది. ఈ విషయాన్ని 2022లో కపిల్ శర్మ షోలో అతడే వెల్లడించాడు. రామాయణం తర్వాత తనను అందరూ విష్ణువు, రాముడిగా చూడటం మొదలు పెట్టారని, దీంతో తర్వాత ఎవరూ తనకు ఎలాంటి పాత్రలు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం.
రామాయణం తర్వాత 14 ఏళ్ల పాటు తనకు ఏవో చిన్నాచితకా పాత్రలు తప్ప ఏవీ దక్కలేదని ఆ షోలో అరుణ్ తెలిపాడు. ఇక 2007 నుంచి 2021 వరకు అరుణ్ గోవిల్ అసలు ఎక్కడా కనిపించలేదు. గతేడాది వచ్చిన ఓఎంజీ 2 మూవీలో మళ్లీ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కాకుండా ఏవో చిన్నాచితకా భోజ్‌పురి సినిమాల్లో కనిపించాడు. గతేడాది జూబ్లీ వెబ్ సిరీస్, ఈ ఏడాది ఆర్టికల్ 370 మూవీలోనూ నటించాడు.
లోక్‌సభ ఎంపీగా..
అరుణ్ గోవిల్ ముందు నటుడు, తర్వాత దేవుడిని చేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అతడు బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాడు. యూపీలోని మీరట్ స్థానం నుంచి పోటీ చేసిన అరుణ్ గోవిల్.. తన సమీప ప్రత్యర్థి అయిన ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మపై 10 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచాడు.
ఈ ఏడాది మొదట్లోనే బీజేపీలో చేరిన అరుణ్ గోవిల్ అతని సొంతూరు అయిన మీరట్ లోక్‌సభ నుంచే బరిలో నిలిచారు. మరి ఈ టీవీ రాముడి రాజకీయ కెరీర్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.