Best Web Hosting Provider In India 2024
Dondakaya Roti Pachadi: పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు రోట్లో వేసి రుబ్బి పచ్చళ్ళు చేసేవారు. వాటి రుచి ఇప్పటి మిక్సీ పచ్చళ్లకు రాదు. ఒకసారి మీరు కూడా దొండకాయ రోటి పచ్చడి చేసుకొని చూడండి. మిక్సీలో అన్నింటినీ వేసి రుబ్బేసే పద్ధతి కన్నా… రోట్లో వేసి దంచుకొని చేసే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో అదిరిపోతుంది. ఇడ్లీ, దోశ ఇలా వేటితో తిన్నా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ దొండకాయ రోటి పచ్చడి రెసిపీ ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి. మీకు నచ్చడం ఖాయం.
దొండకాయ రోటి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు – పావు కిలో
చింతపండు – నిమ్మకాయ సైజులో
కొత్తిమీర – పావు కప్పు
పచ్చిమిర్చి – పది
నూనె – రెండు స్పూన్లు
మెంతులు – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూన్
జీలకర్ర – ఒక స్పూన్
మినప్పప్పు – ఒక స్పూన్
కరివేపాకు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
ఎండు మిర్చి – రెండు
ఇంగువ – చిటికెడు
దొండకాయ రోటి పచ్చడి రెసిపీ
1. దొండకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
3. అందులోనే మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
4. వాటిని చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మళ్లీ నూనె వేయాలి.
6. అందులో పచ్చిమిర్చిని, దొండకాయలను వేసి బాగా మగ్గించుకోవాలి.
7. అలాగే చింతపండును కూడా వేసి బాగా మగ్గించుకున్నాక పక్కన పెట్టుకోవాలి.
8. ఈ మొత్తం చల్లారాక రోట్లో వేసి రుబ్బుకోవాలి. ముందుగా పొడి చేసుకున్న దినుసులను కూడా వేసి దంచుకోవాలి.
9. ఉప్పు, సరిపడా నీళ్లు వేసి రుబ్బుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
10. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి.
11. చివర్లో ఇంగువ వేసి ఆ తాళింపును దొండకాయ మిశ్రమం పైన వేయాలి. అంతే టేస్టీ దొండకాయ రోటి పచ్చడి తయారైనట్టే.
12. ఇది రుచికరంగా ఉంటుంది. దీన్ని మిక్సీలో చేసే కన్నా రోట్లో దంచుకుంటేనే రుచి అదిరిపోతుంది.
దొండకాయలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. దొండకాయలు ప్రతిరోజూ తినడం వల్ల బరువు పెరగరు. పిల్లలకు కూడా దొండకాయలు పెట్టడం మంచిదే, కానీ చాలామంది వాటిని పెట్టేందుకు ఇష్టపడరు. దొండకాయలు తింటే మందబుద్ధులుగా మారుతారని అనుకుంటారు. నిజానికి ఏ అధ్యయనమూ ఈ విషయాన్ని తేల్చలేదు. కాబట్టి దొండకాయలను పెట్టడం మంచిదే. పిల్లలకు అప్పుడప్పుడు దొండకాయ రెసిపీలను తినిపించండి.
టాపిక్