Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: మంగళగిరి అని పలకడం రాని లోకేష్.. ప్రజల గొంతుక ఎలా అవుతాడు. ఎన్నికల్లో స్వయంగా గెలవలేనివాడు ప్రజల గొంతుక ఎలా అవుతాడో ఆలోచన చేసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి, ఆ వెన్నుపోటుకు సహకరించిన వ్యక్తి కాళ్లకు నమస్కారం చేసి.. వెన్నుపోటుకు గురైన వ్యక్తి సమాధికి నమస్కరించి పాదయాత్ర చేయడం అంటే ఇంతకంటే నీతిమాలిన పాదయాత్ర మరొకటి ఉండదన్నారు. లోకేష్ చేయబోయేది పనికిమాలిన పాదయాత్ర అని, మొదటి అడుగు కూడా వేయకముందే భయపడి పాదయాత్రను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర అనుమతి అంశంపై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని, షరతులు అన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారమే యాత్రలు చేయాలని సూచించారు. సుప్రీం కోర్టు 17 పేజీల్లో ఇచ్చిన నిబంధనలకు లోబడే నాడు వైయస్ జగన్ పాదయాత్ర చేశారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని యాత్ర చేశారని గుర్తుచేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎమ్మెల్సీ తలశిల రఘురాం విలేకరుల సమావేశం నిర్వహించారు.