Best Web Hosting Provider In India 2024
Kangana Ranaut: కంగనా రనౌత్ పై చంఢీగడ్ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. తాను ఇలాంటి హింసకు మద్దతివ్వకపోయినా.. ఒకవేళ అలా కొట్టిన ఆ యువతి ఉద్యోగం పోతే తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం గమనార్హం. విశాల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
విశాల్ దద్లానీ ఏమన్నాడంటే..
బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఈ మధ్యే ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ కు గురువారం (జూన్ 6) చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆమె చంఢీగడ్ నుంచి ఢిల్లీ వస్తుండగా అక్కడి ఎయిర్‌పోర్టులో ఓ సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది కంగనాపై చేయి చేసుకుంది. రైతుల ఉద్యమానికి మద్దతుగా తాను ఈ పని చేసినట్లు ఆమె చెప్పడం విశేషం.
దీనిపై కంగనా కూడా తర్వాత స్పందిస్తూ.. తాను సురక్షితంగానే ఉన్నానని, అయితే పంజాబ్ లో ఇలా పెరిగిపోతున్న ఉగ్రవాదులను ఏం చేయాలో అర్థం కావడం లేదని వీడియో ద్వారా చెప్పింది. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందించాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు.
“నేనెప్పుడూ హింసకు మద్దతివ్వను. కానీ ఈ సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ సీఐఎస్ఎఫ్ ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే.. ఆమెకు నేను ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. జై హింద్, జై జవాన్ జై కిసాన్” అని అతడు తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. కంగనాపై చేయి చేసుకున్న ఆ కానిస్టేబుల్ పేరు కుల్విందర్ కౌర్. ఈ ఘటన తర్వాత ఆమెను వెంటనే నిర్బంధంలోకి తీసుకున్నారు.
ఆమెకు మద్దతుగా విశాల్
విశాల్ దద్లానీ ఆ తర్వాత కూడా ఆ యువతికి మద్దతుగా పోస్టులు చేస్తూనే ఉన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లోనే మరిన్ని పోస్టులు చేశాడు. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలో కంగనా చేసిన పోస్టును షేర్ చేస్తూ.. “ఎవరైతే దుంగనా వైపు ఉన్నారో.. వాళ్ల అమ్మ కూడా రూ.100కే అందుబాటులో ఉందని ఆమె అంటే ఏం చేస్తారో?” అని అతడు ప్రశ్నించడం గమనార్హం.
మరో పోస్టులో.. “నేను మళ్లీ చెబుతున్నాను.. మిస్ కౌర్ ను విధుల్లో నుంచి తొలగిస్తే.. ఆమెను నాతో ఎవరైనా మాట్లాడించండి. ఆమెకు కచ్చితంగా మెరుగైన ఉద్యోగం ఇస్తాను” అని విశాల్ స్పష్టం చేశాడు.
ఇప్పుడు మీ నోరు లేవలేదేం: కంగనా
మరోవైపు కంగనా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ పోస్ట్ చేసింది. పాలస్తీనాలోని రఫా గురించి మాట్లాడిన వాళ్ల నోరు ఇప్పుడు ఎందుకు లేవడం లేదని ప్రశ్నించింది. “ఆల్ ఐస్ ఆన్ రఫా గ్యాంగ్.. ఇది మీకు, మీ పిల్లలకు కూడా జరగొచ్చు. ఒకరిపై ఉగ్రదాడిని మీరు సెలబ్రేట్ చేసుకుంటే అది ఎప్పుడో మీ దగ్గరికి కూడా వస్తుంది” అని కంగనా అనడం గమనార్హం.
కంగనా రనౌత్ చాలా రోజులుగా బీజేపీ, పీఎం మోదీకి మద్దతుగా నిలుస్తూ వస్తోంది. ఈ ఏడాదే బీజేపీలో చేరిన ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యపై 74 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది.