Best Web Hosting Provider In India 2024
Ramoji Rao: మీడియా మొఘల్, సినీ నిర్మాత, వ్యాపారవేత్త రామోజీరావు (87) కన్నుమూశారు. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి (జూన్ 8) తెల్లవారుజామున మరణించారు. మీడియా రంగంలో మార్గదర్శకుడిగా, దిగ్గజంగా రామోజీరావు నిలిచారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై 87 సినిమాలను కూడా నిర్మించారు. చాలా మంది నటీనటులు, దర్శకులు, ఇతర టెక్నిషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహించారు. రామోజీరావు నిర్మించిన సినిమాల్లో చాలా సూపర్ హిట్‍లు, మంచి చిత్రాలుగా నిలిచాయి. అయితే, రామోజీ రావు ఓ చిత్రంలో నటుడిగానూ వెండితెరపై కనిపించారు.
రామోజీ రావు నటించిన చిత్రం ఇదే
రామోజీ రావు ఓ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ఆ సినిమాపేరు ‘మార్పు’. 1978 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రంలో న్యాయమూర్తి పాత్రను ఆయన పోషించారు.
రామోజీరావు అతిథి పాత్ర చేసిన మార్పు సినిమాకు యు.విశ్వేశ్వర రావు దర్శకత్వం వహించారు. నిర్మాత కూడా ఆయనే. ఈ చిత్రంలో శ్రీధర్, మాధవి ప్రధాన పాత్రలు పోషించారు. నటసార్వభౌముడు ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో ఓ అతిథి పాత్ర చేశారు. ఇదే సినిమాలో రామోజీ రావు కూడా న్యాయమూర్తిగా వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో రామోజీ రావుది అతిథి పాత్రే అయినా.. ఆ మూవీ యూనిట్ ఆయన ఫొటోలతో కూడా పోస్టర్లు వేసింది.
రామెజీరావుకు ప్రముఖుల నివాళి
రామోజీరావుకు సినీ ప్రమఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళి, రాఘవేంద్ర రావు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, సురేశ్ బాబు, మురళీ మోహన్‍తో పాటు చాలా మంది సినీ ప్రముఖులు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సహా చాలా మంది సినీ హీరోలు ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.
షూటింగ్‍కు సెలవు
రామోజీరావు మృతికి సంతాపంగా రేపు (జూన్ 9) టాలీవుడ్‍లో సినిమా షూటింగ్‍లు బంద్ కానున్నాయి. ఈ విషయాన్ని సినీ నిర్మాతల మండలి అధికారికంగా ప్రకటించింది. దీంతో రేపు షూటింగ్‍లకు విరామం ఉండనుంది.
అంత్యక్రియలు
రామోజీ రావు అంత్యక్రియలు రేపు (జూన్ 9) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీరావు అంత్యక్రియలకు సినీ, రాజకీయ, వ్యాపార సహా వివిధ రంగాల ప్రముఖులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది.
రామోజీరావు 87 సినిమాలను నిర్మించారు. నిర్మాతగా శ్రీవారికి ప్రేమలేఖ (1984) ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత వరుసగా చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ చిత్రాలను ప్రొడ్యూజ్ చేశారు. నిర్మాతగా రామోజీరావు చివరగా నిర్మించిన మూవీ దాగుడుమూతల దండాకోర్ (2015). చాలా మంది కొత్త నటీనటులు, టెక్నిషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits