Best Web Hosting Provider In India 2024
Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీరావు భౌతికకాయానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో నివాళులు అర్పిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసంలో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి.. తుది నివాళి సమర్పిస్తున్నారు. నేటి (జూన్ 8) తెల్లవారుజామున మీడియా దిగ్గజం, సినీ నిర్మాత రామోజీరావు కన్నుమూశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రామోజీరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయనతో ఉన్న ఓ జ్ఞాపకాన్ని వెల్లడించారు.
చిన్నపిల్లాడిని కూడా చూశా
ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో సమయంలో తాను రామెజీరావుకు ఓ పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చానని, చాలా ఆప్యాయంగా చిన్న పిల్లాడిలా సంతోషిస్తూ ఆయన తీసుకున్నారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. “అందరూ ఆయన(రామోజీరావు)లో ఒక గంభీరమైన వ్యక్తిని చూసి ఉంటారు. కానీ నేను ఆయనలో చిన్నపిల్లవాడిని కూడా చూశా. 2009లో ప్రజారాజ్యం పార్టీ పనులకు సంబంధించి తరచూ నేను ఆయనను కలుస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో భోజనం తర్వాత నేను.. ఆయనకు నేను ఒక కార్టియర్ పెన్ను బహుమతిగా ఇచ్చా. ఎందుకంటే ఆయన పెన్నులను కలెక్ట్ చేస్తుంటారు. ఆ పెన్ను ఇచ్చినప్పుడు వద్దంటారని అనుకున్నా. కానీ చాలా ఆప్యాయంగా తీసుకున్నారు. చిన్నపిల్లవాడిలా ఆ పెన్ చూసుకుంటూ చాలా బాగుందని సంతోషంగా చెప్పారు” అని చిరంజీవి తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు.
పెద్ద దిక్కును కోల్పోయాం
తనకు పెన్నులు చాలా ఇష్టమని, తన ఆలోచనలను రాస్తూనే ఉంటానని రామోజీరావు చెప్పారని చిరంజీవి తెలిపారు. రకరకాల రంగుల ఇంకులతో ఆయన ఆలోచనలను అక్షర రూపంలో డైరీలో రాయడం చూశానని, నిరంతం ఈ సమాజానికి ఏం చేయాలనే ఆలోచించే వారని చిరూ చెప్పారు. తన పెన్నుల కలెక్షన్లన్నీ చూపించారని చిరంజీవి తెలిపారు. రామోజీరావులో పిల్లాడిని కూడా తాను చూడగలిగానని చిరూ అన్నారు. యావత్ తెలుగుజాతికే పెద్ద దిక్కును, మహా శక్తిని కోల్పోయామంటూ చిరూ ఎమోషనల్ అయ్యారు.
నివాళులు అర్పించిన పవన్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రామోజీరావుకు నివాళి అర్పించారు. రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. పవన్‍తోనే మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయనను కలవాలని తాను అనుకున్నానని పవన్ అన్నారు. రామోజీరావు మహోన్నత వ్యక్తి అని, ఆయన మరణవార్త తనకు తీవ్రంగా దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.
కన్నీరు పెట్టుకున్న అన్నపూర్ణమ్మ
కళాకారులందరికీ రామెజీరావు దేవుడంటూ కన్నీరు పెట్టుకున్నారు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ. అలాంటి ఆయనే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లిపోయారని భావోద్వేగం చెందారు. తెలుగుకు ఎంతో వెలుగు తెచ్చిన వ్యక్తి అని అన్నారు. తెలుగుకు ఆయన ఎంతో గౌవరాన్ని పెంచారని, ఆయన వెళ్లిపోయారనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నపూర్ణమ్మ కన్నీరు పెట్టుకున్నారు.
రామోజీరావు అంత్యక్రియలు రేపు (జూన్ 9) రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ లాంఛనాలతో తెలంగాణ ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించనుంది.
టీ20 వరల్డ్ కప్ 2024
Best Web Hosting Provider In India 2024
Source / Credits