Best Web Hosting Provider In India 2024
BRS MLA Padi Kaushik Reddy: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు చేశారు. రామగుండం ఎన్టీపిసి నుంచి ఫ్లై యాష్ బూడిదను అక్రమంగా తరలిస్తూ రోజుకు 50 లక్షల వరకు మంత్రి పొన్నం పొందుతున్నారని ఆరోపించారు.
ఓవర్ లోడ్ తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.
రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిబంధనల ప్రకారం ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్ బూడిద లారీ కొక్కంటికి 25 వేలు తీసుకొని వే బిల్లు ఇచ్చి 32 టన్నుల వరకు తరలించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వే బిల్లు లేకుండా ఒక్కో లారీలో 70 నుంచి 80 టన్నుల బూడిదను అక్రమంగా తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
రోజుకు 200 నుంచి 300 లారీల వరకు లారీ ఒక్కంటికి 30 నుంచి 40 వేల వరకు మంత్రి పొన్నం అక్రమంగా పొందుతున్నారని, అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గ్రీన్ ఫీల్డ్ హై వేకు ఎన్టీపీసీ బూడిద…
రామగుండం ఎన్టీపీసీ ప్లై యాష్ బూడిదను గ్రీన్ ఫీల్డ్ హైవే వినియోగిస్తున్నారు. రామగుండం నుంచి ఖమ్మం వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ హైవే కు ఎన్టీపీసీ బూడిద ఏజెన్సీల ద్వారా సరఫరాకు అనుమతి ఇచ్చారు. అయితే లారీల సామర్థ్యానికి మించి యాష్ ప్లాంట్ నుండి బూడిదను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
గతంలో వరంగల్ సమీపంలోని వర్ధన్నపేట వద్ద లారీలను స్థానికులు ఆడ్డుకుని ఆందోళన దిగారు. బూడిద రవాణాతో రోడ్డు పక్కన గల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… ఓవర్ లోడ్ తో వెళ్తున్న లారీలతో రోడ్డు ధ్వంసం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం కట్టడి చర్యలు తీసుకోకపోగా లోకసభ ఎన్నికలకు ముందు మాత్రం కొద్ది రోజుల పాటు యాష్ తరలించే లారీలను నిలిపివేశారు.
తిరిగి ఎన్టీపీసీ నుండి ఖమ్మం వరకు ఓవర్ లోడ్ తో యాష్ ను తరలిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవర్ లోడ్ కు ఎలా అనుమతిస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే హైవే నిర్మాణం కోసం రవాణా అవుతున్న ఈ యాష్ కు కాంట్రాక్టర్ బిల్లులను తూకం వేసి చెల్లిస్తారని చెప్తున్నారు.
లారీల్లో ఎంత క్వాంటిటీ యాష్ చేరితే అంతకు బిల్లులు ఇస్తుండడం… ఇందుకు ఎన్టీపీసీ అధికారులు కూడా యాష్ ప్లాంట్ నుండి బూడిద తరలించేందుకు అనుమతిస్తుండడం విడ్డూరంగా మారింది. ప్రభుత్వం విధించిన నిబందనలనే ప్రభుత్వ శాఖలు తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రిపోర్టింగ్ – HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్