Best Web Hosting Provider In India 2024
Chandrababu Oath Updates: ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏర్పాట్లను కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఐఏఎస్ లు పర్యవేక్షిస్తున్నారు.
ఐటీ పార్క్ వద్ద వేదిక….
ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా ఎన్. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి వద్ద గల ఐటీ పార్క్, మేధా టవర్స్ నేషనల్ హైవే పక్కన ఉన్న పొట్లూరి బసవరావు స్థలంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చంద్రబాబు, మంత్రులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార సభకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవిచంద్ర, శశిభూషణ కుమార్ అదనపు డీజీపీ బాగ్చి, టిఆర్ అండ్ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫాలు, ఉద్యాన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్లు వివేక్ యాదవ్, ఏపీ ఎన్ కో సీఎండీ చక్రధర్ బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకె బాలాజీ, ఢిల్లీరావు, విజయవాడ పోలీస్ కమిషనర్లు పీహెచ్డీ రామకృష్ణ, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టీఆర్ జిల్లా జేపీ సంపత్ కుమార్, గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యవేక్షణకు ఐదుగురు అధికారులు….
ఈనెల 12న జరుగునున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ ఐదుగురు ఐఏఎస్ అధికారులు తక్షణమే ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్)కు రిపోర్టు చేసుకోవాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో ఏ బాబు, ఎం హరి జవహర్‌లాల్, కె.కన్నబాబు, సిహెచ్ హరి కిరణ్, జి.వీరపాండియన్ ఉన్నారు. వీరంతా మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్