Chit Fund Fraud : కరీంనగర్ మరో చిట్ ఫండ్ మోసం, డబ్బులు అడిగితే చంపుతామని బెదిరింపులు

Best Web Hosting Provider In India 2024


Chit Fund Fraud : అవసరానికి ఉపయోగపడుతాయని ప్రైవేట్ చిట్ ఫండ్ లో పొదుపు చేసిన మహిళను కనకదుర్గ చిట్ ఫండ్ నిర్వాహకులు మోసం చేశారు. చిట్టీ గడువు ముగిసినా డబ్బులు చెల్లించకపోవడంతో పాటు చెల్లని చెక్ ఇచ్చి మోసం చేశారు. డబ్బులు అడిగితే చంపుతామని బెదిరించారు. భయాందోళనకు గురైన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో చిట్ ఫండ్ చీటింగ్ బయటపడి ఇద్దరిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

సిరిసిల్ల జిల్లా గీతానగర్ కు చెందిన గడ్డం జమున ప్రస్తుతం కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్నారు. జమున కరీంనగర్ ఐబీ చౌరస్తాలోని కనకదుర్గ చిట్ ఫండ్ లో మూడు లక్షల రూపాయల చిట్ లో సభ్యురాలిగా చేరారు. చిట్ కి సంబంధించిన గడువు కాలం ముగియడంతో తనకు రావాల్సిన అమౌంట్ గురించి అడగగా హన్మకొండ జిల్లా గోపాలాపూర్ కి చెందిన కనకదుర్గ చిట్ ఫండ్ ఛైర్మన్ రాగిడి తిరుపతయ్య అలియాస్ తిరుపతి రెడ్డి అతని అనుచరుడైన రాజు రెండు ఖాళీ బ్యాంకు చెక్ లు అందచేశారు. వాటిని బ్యాంక్ ఖాతాలో జమ చేయగా చెక్ లు చెల్లలేదు. బాధితురాలు జమున.. చిట్ ఫండ్ ఛైర్మన్ తిరుపతి రెడ్డిని అడగ్గా డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడమేగాక మరోసారి అడిగితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేయడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో చిట్ ఫండ్ ఛైర్మన్ రాగిడి తిరుపతిరెడ్డి, అతని అనుచరుడు రాజుపై ఐపీసీ సెక్షన్స్ 420, 406,506 రెడ్ విత్ 34 ప్రకారం టూ టౌన్ సీఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు.

ఆగని చిట్ ఫండ్ మోసాలు

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ చిట్ ఫండ్ మోసాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిడ్ ఫండ్ కంపెనీలు చీటింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో 200 లకు పైగా ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఉంటే అందులో పది కూడా సక్రమంగా నడిచేవి లేవు. అంటే ఏ స్థాయిలో చిట్ ఫండ్ మోసాలు జరుగుతున్నాయే అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.‌ కరీంనగర్ వరంగల్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన మరో ప్రైవేట్ చిట్ ఫండ్ కు చెందిన ఛైర్మన్ తో సహా ఐదుగురు డైరెక్టర్లను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి జైల్ కు పంపించారు. ఇప్పటికే పలు చిట్ ఫండ్ కంపెనీల ఛైర్మన్లు డైరెక్టర్ లు మేనేజర్ లపై కేసులు నమోదు అయ్యాయి. అయితే వారి నుంచి కోట్లాది రూపాయలు సభ్యులకు చెల్లించాల్సి ఉండడంతో చెల్లిస్తామని హామీలు ఇవ్వడంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. మోసం చేసే చిట్ ఫండ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

KarimnagarCrime TelanganaTelangana NewsTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024