Best Web Hosting Provider In India 2024
Boy Chokes To Death : బిస్కెట్ బాలుడు ప్రాణం తీసిందంటే, ఎవరైనా నమ్ముతారా? అంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ బిస్కెట్ ఒక బాలుడి ప్రాణం తీసిందనేది వాస్తవం. గొంతులో బిస్కట్ అడ్డుపడి ఓ బాలుడు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా బొందుగూడలో చోటుచేసుకుంది. డుంబ్రిగూడ మండలం బొందుగూడ గ్రామానికి చెందిన తేజ అనే మూడేళ్ల బాలుడు బిస్కెట్ తింటుండగా గొంతులో అడ్డుపడింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడుని అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బిస్కెట్ గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో బొందుగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈత వెళ్లి ఇద్దరు చిన్నారులు బలి
వేసవి సెలవుల్లో గేదెలు కాసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులను ఈత సరదా విగత జీవులుగా మార్చింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్లలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సారెకుక్క నీలాంబరం, నాగమణి దంపతుల పెద్ద కుమారుడు ఈశ్వరయ్య (15), సిరిపురం జెడ్పీ పాఠశాల్లో తొమ్మిది తరగతి పూర్తి చేశాడు. పదో తరగతిలోకి వెళ్తున్నారు. కుక్కమళ్ల ఏసుదాసు, కోటేశ్వరమ్మల కుమారుడు ప్రసంగి (16) పదో తరగతిలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి సప్లమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి ఉన్నాడు. వీరిద్దరూ గేదెలు తోలుకుని లింగంగుంట్ల-చునమక్కెన గ్రామల మధ్య ఉన్న దక్షిణ పొలానికి వెళ్లారు. రైల్వేట్రాక్ పక్కన ఉన్న వాగులో ఇటీవల వర్షానికి కురిసిన నీటి మడుగు నిండటంతో అందులో ఈత కోసమని దిగారు. ఆ నీటిగుంతలో నల్లమట్టి పేరుడు ఉండటంతో బురదలో కూరుకుపోయారు. వారు అందుల్లోంచి రావడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ రాలేకపోవడంతో మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం పరిధిలోని రెడ్డిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖైదీ మృతి చెందారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లక్ష్మీపేటకు చెందిన ఉప్పర ఈరన్న (48) ఓ కేసులో శిక్షపడి బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి సమీపంలోని అనంతపురం జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈరన్న సబ్ జైలు ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకులో పని చేస్తున్నారు. పెట్రోల్ బంకు వద్దకు వచ్చేందుకు జైలు ఎదురుగా ఉన్న రోడ్డును దాటుతుండగా రెడ్డిపల్లి నుంచి అనంతపురం వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఈరన్న అక్కడికక్కడే మరణించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్