Best Web Hosting Provider In India 2024
మీలో చాలా మంది చిన్నప్పుడు బలపం తినే ఉంటారు. అది తింటుంటే.. నోటికి వచ్చే రుచి చాలా బాగుంటుంది. ఎవరూ చూడకముందు ఒక ముక్క కొరికేసి.. కాసేపు నమిలితే వచ్చే ఆనందం వేరు. బడిలో టీచర్లకు, ఇంట్లో అమ్మానాన్నలకు తెలియకుండా బలపాలు తిని.. తిని ఇబ్బందులు పడ్డవారు అనేక మంది. స్కూల్లో టీచర్ బలపమెందుకు తింటున్నావ్ అని కొట్టినా అలవాటును మానేయరు. కొంతమంది అమ్మాయిలైతే.. ఇప్పటికీ ఆ అలవాటను కంటిన్యూ చేస్తారు. వారి హ్యాండ్ బ్యాగ్‌లో కచ్చితంగా బలపం ముక్క ఉంటుంది. కానీ దీనిని తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
చెడు ప్రభావాలు
బలపం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీ స్నేహితురాలు, సోదరి కూడా తింటూ ఉండవచ్చు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎక్కువగా తింటారు. కానీ ఆ అలవాటు ఎక్కువగా చిన్నవయసులోనే ఉంటుంది. షాపుల్లో బలపం చూస్తే.. కొనుక్కుని తినాలని అనుకునేవారు చాలా మంది. ఇది తినడానికి రుచికరంగా ఉన్నప్పటికీ శరీరంపై చెడు ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాదు.. ఆ సమస్యలు చాలా కాలం పాటు ఉంటాయి.
కిడ్నీలో రాళ్లు
సున్నంతో కలిపి స్లేట్ పెన్సిల్ తయారవుతుంది. దీన్ని తినడం ఆరోగ్యానికి హానికరం. కానీ పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. బలపం తింటే మహిళల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. ఏదో ఒకవిధంగా వారు చిన్నతనంలో బలపం తినడం కూడా ఇందుకు కారణం కావొచ్చు.
జీర్ణ సమస్యలు
బలపం తింటే జీర్ణ సమస్యలు, రక్తహీనత వస్తుంది. అంతే కాకుండా దీని వల్ల మొదటగా ప్రభావితమయ్యే అవయవం మూత్రపిండాలు. అలాగే దీన్ని తినడం వల్ల డయేరియా, రుతుక్రమం ఆలస్యం, కడుపులో కణితులు వంటి సమస్యలు వస్తాయి.
దంతాలపై ప్రభావం
స్లేట్ పెన్సిల్ తినడం దంతాల మీద ప్రభావం చూపుతుంది. కాలక్రమేణా దంతాలు అనారోగ్యకరంగా మారతాయి. అంతే కాకుండా దీని వినియోగం దవడపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల దవడలో నొప్పి వస్తుంది.
మలబద్ధకం
స్లేట్ పెన్సిల్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఇది పోషకాహారలోపానికి కూడా దారితీస్తుంది. ఎందుకంటే అవి ఎటువంటి పోషక విలువలను అందించవు. అవసరమైన పోషకాలను గ్రహించడంలో ఇబ్బందులను కలిగిస్తాయి. స్లేట్ పెన్సిల్స్ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా బలపంలో అధిక స్థాయిలో ఆక్సలేట్‌లు ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో బలపం తీసుకోవడం వల్ల పేగు అడ్డంకి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో జీర్ణవ్యవస్థ నిరోధించబడుతుంది. ఆహారం సరిగా వెళ్ళదు. మీరు పైన లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మంచి తిండి అలవాటు చేసుకోండి
బలపం తినడం ఒక ఆసక్తికరమైన అలవాటుగా అనిపించవచ్చు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వీటిలో దంత సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, పోషకాహార లోపం, రక్తహీనత, మూత్రపిండాల్లో రాళ్లు, పేగు అడ్డంకులు ఉన్నాయి. అలవాటును మానుకోవడానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాన్ని చూడాలి. దానికి బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిండి వైపు మళ్లండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం చేయాలి.