AP Cabinet Ministers : ఏపీ కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు- జనసేనకు ప్రాధాన్యత, ఎవరికెన్నంటే?

Best Web Hosting Provider In India 2024


AP Cabinet Ministers : దిల్లీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రానికి చేరుకున్నారు. నిన్న దిల్లీలో జరిగిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ఇరువురు నేతలు హాజరయ్యారు. రాష్ట్రానికి చేరుకున్న చంద్రబాబు…కేబినెట్ పై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్…కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఎవరికి కేబినెట్ బెర్తులు కన్ఫార్మ్ అవుతాయో అనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘనవిజయం సాధించింది. 164 స్థానాలతో తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేనకు ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయోననే చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పోస్టుపై ఆసక్తిగా ఉన్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పవన్ తో ఆ పార్టీలో మరికొందరిని కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్లు విషయంలో కాంప్రమైజ్ అయిన జనసేనకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుందని తెలుస్తోంది. కనీసం 5కు తగ్గకుండా మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

26 మందితో కేబినెట్!

రాజ్యాంగంలో ఆర్టికల్ 164(1A) ప్రకారం రాష్ట్ర శాసనసభలోని సభ్యుల సంఖ్యలో 15 శాతం కంటే ఎక్కువగా మంత్రి మండలి ఉండకూడదు. సీఎం సహా మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ కాకుండా, మొత్తం సభ్యుల్లో 15 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉండాలి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో 15 శాతం అంటే 26 మందితో మంత్రి మండలి ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ 25 మందిలో టీడీపీ, జనసేనకు ఎక్కువ మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కేంద్రంలో టీడీపీకి రెండు పదవులు మాత్రమే ఇవ్వడంతో రాష్ట్రంలో బీజేపీ అంతగా ప్రాధాన్యత దక్కే అవకాశం లేదని, ఒక మంత్రి పదవి మాత్రమే ఇచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇక మిగిలిన 25 మంత్రి పదవుల్లో టీడీపీ 20, జనసేనకు 5 కేబినెట్ బెర్తులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీజేపీ గట్టిగా పట్టుబడితే రెండు వరకూ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రేపు రాత్రికి రాష్ట్ర మంత్రివర్గంపై క్లారిటీ రానుంది.

జనసేనకు ప్రాధాన్యత

ఎన్నికల్లో పోటీ సమయంలో సీట్లు సర్దుబాటు విషయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒక అడుగువెనక్కి తగ్గారు. కూటమి జట్టు కట్టడంలో సీట్ల సర్దుబాటులో సమస్యలు రాకుండా పవన్ కల్యాణ్ వ్యవహరించారు. దీంతో మంత్రి పదవుల కేటాయింపులో జనసేనకు చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. పవన్ త్యాగానికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరగుతోంది. జనసేనకు 5 మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌తో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరికి కేబినెట్ లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. అలాగే బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌కు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ జనసేనలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ జనసేనకు 4 మంత్రి పదవులు దక్కితే కాపు సామాజిక వర్గానికి 2, బీసీ 1, ఎస్సీ 1 కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. అయితే ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయో మంగళవారం రాత్రికి స్పష్టత రానుంది. మంత్రి పదవులు దక్కిన వారు బుధవారం చంద్రబాబుతో సహా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduAp CabinetJanasenaPawan KalyanTdpBjpAp PoliticsAndhra Pradesh NewsAndhra Pradesh Assembly Elections 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024