Best Web Hosting Provider In India 2024
Janasena : కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సంకీర్ణ సర్కార్ కొలవుదీరింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అయ్యారు. అందులో ఒకటి కేబినేట్ హోదా కాగా, మరొక్కటి సహాయ మంత్రి పదవులు టీడీపీకి దక్కాయి. అయితే ఏపీలోని మరో ఎన్‌డీఏ భాగస్వామి జనసేనకి మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా రాలేదు. అసలు కేంద్ర మంత్రి పదవి జసేన అధినేత పవన్ కల్యాణ్ అడగలేదా? లేదంటే బీజేపీ ఇవ్వలేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కీలకంగా జనసేన
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జనసేన ఎన్‌డీఏ భాగస్వామిగా వెళ్లింది. రాష్ట్రంలో జనసేన, బీజేపీ ఎన్‌డీఏ కూటమిలో ఉండేవి. అయితే ఎన్నికల ముందు టీడీపీని ఎన్‌డీఏలోకి తీసుకురావడానికి, అందుకు బీజేపీ పెద్దలను ఒప్పించడానికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ప్రయత్నం చేశారు. కూటమి పొత్తు పొడవడానికి ఒకనొక సమయంలో తాను బీజేపీ నేతల కాళ్లు కూడా పట్టుకున్నానని, టీడీపీని బీజేపీని కలపడానికి తాను చాలా కష్టపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగానే ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడానికి పవన్ కల్యాణే ప్రధాన కారకుడని అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. పొత్తు సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి ఏకంగా 164 అసెంబ్లీ స్థానాలను సొంత చేసుకుంది. టీడీపీ 134, జనసేన 21, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. 25 పార్లమెంట్ స్థానాల్లో కూటమి ఏకంగా 21 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 లోక్‌సభ స్థానాలను సొంతం చేసుకున్నాయి.
71 మందితో కేంద్ర కేబినెట్
అయితే ఇంత వరకు బాగానే ఉంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినేట్ మంత్రులు కాగా, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మరో ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. 71 మందిలో 60 మంది బీజేపీకి చెందిన మంత్రులే. మిగిలిన 11 మంది మంత్రి పదవులు ఏన్‌డీఏ కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చారు. ఇందులో టీడీపీకి రెండు, జేడీయూకి రెండు, జేడీఎస్, ఎల్‌జేపీ, ఆర్ఎల్‌డీ, శివసేన (షిండే), అప్నాదళ్, హెచ్ఎఎం, ఆర్‌పీఐ పార్టీలకు ఒక్కొక్క మంత్రి పదవులు దక్కాయి. వీటిలో టీడీపీకి ఒక కేబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు దక్కాయి. జేడీయూకి కూడా ఒక కేబినేట్, ఒక సహాయ మంత్రి పదవులు దక్కాయి. జేడీఎస్, ఎల్‌జేపీ, హెచ్ఎఎంలకు కేబినేట్ పదవి దక్కింది. మిగిలిన నాలుగు పార్టీలకు కేవలం సహాయ మంత్రి పదవులే దక్కాయి.
జనసేన కంటే తక్కువ ఎంపీలున్న వారికీ
అయితే ఏపీలో కీలక పాత్ర పోషించిన జనసేనకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. మరోవైపు మంత్రి పదవులు దక్కిన పార్టీల్లో టీడీపీ (16), జేడీయూ (12) పార్టీలే పెద్ద పార్టీలుగా ఉన్నాయి. తరువాత స్థానంలో శివసేన (7), ఏల్‌జేపీ (5), జేడీఎస్ (2), ఆర్ఎల్‌డీ (2), అప్నాదళ్ (1), హెచ్ఏఏం (1) ఉన్నాయి. ఆర్‌పీఐకి లోక్‌సభలో ఒకస్థానం కూడా లేదు. రాజ్యసభలో మాత్రం ఒక సభ్యుడు ఉన్నారు. ఇలా జనసేన (2) కంటే తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలకు కూడా కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. మరి జనసేనకు ఎందుకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదని సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే జనసేన అధినేతే వద్దన్నారా? లేక బీజేపీ ఇవ్వనందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజమండ్రి బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాకినాడ ఎంపీగా జనసేన అభ్యర్థిగగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఎన్నికల సమయంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా దాన్ని ప్రచారం చేసుకున్నారు. కానీ కేంద్ర మంత్రి వర్గంలో జనసేనకు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు చోటు దక్కలేదు.
ఏపీ నుంచి ముగ్గురికి
ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు అయ్యారు. అందులో టీడీపీ నుంచి కె. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కాగా, బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కాగా, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జనసేన నుంచి మాత్రం ఒక్కరూ లేకపోవడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్