Best Web Hosting Provider In India 2024
Kishan Reddy : తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి కేబినెట్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు ఇవ్వడం హర్షదాయకమని, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రిగా, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించడం హర్షదాయకమన్నారు. ఒకట్రెండు రోజుల్లో అధికారులతో చర్చించిన తర్వాత.. ‘మిషన్ 100 డేస్ అజెండా’తో ముందుకెళ్తామన్నారు. దేశాభివృద్ధిల్లో బొగ్గు పాత్ర కీలకమని, బొగ్గు వెలికితీత, ఎగుమతి, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాననే విశ్వాసం తనకుందన్నారు. ప్రైవేటు రంగంలో చాలా సంస్థలు బొగ్గు గనుల వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్నాయని, వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. విద్యుదుత్పత్తి, స్టీల్ కంపెనీలకు బొగ్గు అవసరం ఉంటుందన్నారు.
బొగ్గు, గనులు రెవెన్యూ తెచ్చే శాఖలు
“గనులు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటాయి. ఇసుకతో పాటుగా చాలా వరకు ఖనిజాల వెలికితీతపై గనుల శాఖ పర్యవేక్షిస్తుంది. బొగ్గు, గనుల శాఖలు.. దేశానికి రెవెన్యూ తీసుకొచ్చే శాఖలు. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పెంచే విషయంలో ప్రత్యేక చొరవతీసుకుంటాం. 2014కు ముందు దేశంలో విద్యుత్ కోతలుండేవి. మోదీ వచ్చాక బొగ్గు ఉత్పత్తి పెంచడం ద్వారా.. విద్యుత్ కోతల్లేని దేశంగా నిర్మించారు. ఈ దిశగా బొగ్గు కొరత లేకుండా.. మరింత విద్యుదుత్పత్తి పెంచడంపై దృష్టి సారిస్తాం. దేశమంతా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగం రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. యూపీఏ హయాంలో బొగ్గు రంగంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. మోదీ వచ్చాక.. పారదర్శకమైన విధానాలు తీసుకొచ్చి.. బొగ్గు తవ్వకం, సరఫరా, వినియోగం విషయంలో అవినీతి లేకుండా పనిచేశాం” – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలుగు రాష్ట్రాల మంత్రులకు మంచి శాఖలు
ప్రధాని మోదీ నాయకత్వంలో బొగ్గు, గనుల విషయంలో తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల మంత్రులకు మంచి శాఖలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మోదీ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను ఇవ్వడం.. విజయవాడ, హైదరాబాద్, విశాఖ, పుట్టపర్తి మొదలైన విమానాశ్రయాల సమర్థవంతమైన నిర్వహణ, అభివృద్ధికి బాటలు పడతాయని విశ్వసిస్తున్నానన్నారు. వరంగల్ లో విమాన సేవల కోసం వారితో కలిసి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్