Best Web Hosting Provider In India 2024
London Death: పల్నాడు జిల్లా అచ్చం పేట మండలం కోనూరు గ్రామానికి చెందిన యువకుడు గుంటుపల్లి సాయిరాం (25) లండన్ బీచ్‌లో మృతి చెందాడు. లండన్‌లోని లాన్‌షైర్ దగ్గరలోని బ్లాక్‌పూల్ బీచ్‌లో ఈనెల 2 రాత్రి మృతి చెందినట్లు పోలీస్ శాఖ నుంచి సోమవారం మధ్యహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
సాయిరాం మృత దేహాన్ని లండన్‌లోని బ్లాక్‌పూల్ విక్టోరియా ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. కోనూరుకు చెందిన ఏడు కొండలు, అన్నపూర్ణమ్మ దంపతులకు కిరణ్ సాయి, సాయిరాం ఇద్దరు సంతానం. ఏడు కొండలు ఐదేళ్ల కిందట మరణించాడు. సాయిరాం లండన్‌లోని హీట్ పోర్డు షైన్ యూనివర్శిటీలో ఉన్నత చదువుల చదువుతున్నాడు.
2021లో సాయిరాం లండన్‌కు ఉన్నత చదువుల కోసం సాయిరాం వెళ్లాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లోని పోర్టులో పని చేస్తున్నారు. ఈనెల 2న లండన్‌లోని బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు చనిపోయాడు. ప్రస్తుతం తల్లి అన్నపూర్ణమ్మ తీర్థయాత్రలకు షిర్డీ వెళ్లింది. ప్రభుత్వం స్పందించి యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని బంధువులు కోరుతున్నారు.
విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి
విద్యుత్ షాక్‌కు గురై అన్నదమ్ములు మృతి చెందారు. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్ధలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీలం గోపీకృష్ణ శుభకార్యాలకు సామాన్లు సప్లై చేస్తుంటారు. ఆయన కుమారులు శీలం లోహిత్ కృష్ణ (18) ఐటీఐ (ఎలక్ట్రీకల్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శీలం సాయికృష్ణ (16) పదో తరగతి పూర్తి చేశారు.
వారిద్దరూ ఖాళీ సమయంలో తండ్రికి చేదోడుగా ఉంటారు. సప్లయర్స్ పనుల్లో సాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో లోహిత్ కృష్ణ, సాయి కృష్ణ పట్టణంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ శుభకార్యానికి సామాన్లు సప్లై చేసి తిరిరగి వాటిని తీసుకొని బయలు దేరారు. అప్పుడే ఆ పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటరు వైర్లు సామాన్లు ఉన్న ఆటోకు తగిలి విద్యుత్ సరఫరా అయింది.
దీంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములిద్దరూ షాక్‌కు గురయ్యారు. వీరిద్దరినీ కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేసి, విచారిస్తున్నారు.
గుంటురు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
గుంటురు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుభకార్యం అలంకరణ పనులకు వెళ్లి వస్తునన కూలీలు మరొ కొద్ది సేపటికి ఇంటికి చేరుతారనే లోపే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
విజయవాడలో శుభకార్యాల అలంకరణ పనికి తొమ్మిది మంది కూలీలు వెళ్లారు. ఆ పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా, గుంటూరు జిల్లా పెదకాకాని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్, కంకర కలిపే మిల్లర్‌ను ఐషర్ వాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసుకెళ్తున్నారు. పెదకాకాని అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ ఆసుపత్రి ఎదుట ఉన్న జాతీయ రహదారి వద్ద ఆగి ఉన్న ఐషర్ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్‌ని బలంగా ఢీకొట్టింది.
దీంతో మిల్లర్ రోడ్డు మధ్యలోకి జరిగింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి విజయవాడలో శుభకార్యం అలంకరణ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న కూలీలతో ఉన్న టాటా ఏస్ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొంది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్‌లో ఉన్న కూలీలు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన పది మంది కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మరొక కూలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు (40), గుంటూరు చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా, పాత గుంటూరుకు చెందిన డి. మధు (25) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు కారులో ఉన్న ముగ్గురు స్వల్పంగా గాయపడటంతో వారు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతి
గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతి చెందారు. ఈ ఘటన ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట చిన్న శెట్టి బజారుకు చెందిన 15 మంది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులోని శివాలయానికి వెళ్లారు. వారంతా అక్కడ జల్లు స్నానాలు చేశారు.
వారితో పాటు వచ్చిన అల్లంశెట్టి తేజశ్రీనివాస్ (23) గోదావరి నదిలో స్నాం చేసేందుకు దిగారు. స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి మునిగారు. కుమారుడిని రక్షించేందుకు తల్లి నాగమణి (45) గోదావరిలో దిగగా ఇద్దరూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృత దేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు)
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్