నా బిడ్డను పోలీసులు బలి తీసుకున్నారు

Best Web Hosting Provider In India 2024

సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాజేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు తండ్రి డిమాండ్‌

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన రెంటపాళ్ల ఉపసర్పంచ్, వైయ‌స్ఆర్‌సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు మృతదేహానికి సోమవారం గుంటూరు జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, గ్రామస్తులు సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తారని తెలుసుకున్న పోలీసులు మేడికొండూరులో వారిని ఆపారు.
సత్తెనపల్లి టౌన్, మేడికొండూరు సీఐలు పోలూరి శ్రీనివాసరావు, జయకుమార్‌.. వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. ఎస్బీ సీఐ సురేష్‌ ఫోన్‌లో మాట్లాడుతూ జరిగిన విషయం బాధాకరమని, అన్ని విషయాలను పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గర్గ్‌కు వివరించి తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని అతడికి తెలిపారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు కారకుడైన సీఐ రాజేశ్‌ కుమార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని, ఎలాంటి ఆందోళన చేయకుండా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. పోలీస్‌ అధికారులు హామీ ఇవ్వడంతో మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు మెత్తబడ్డారు. మృతదేహం ఉన్న వాహనంతో పాదయాత్రగా, ద్విచక్ర వాహనాలతో సత్తెనపల్లి, పాకాలపాడు మీదుగా రెంటపాళ్లకు చేరుకున్నారు.

అక్కడ సత్తెనపల్లి డీఎస్పీ జి.గురునాథ్‌ బాబు నేతృత్వంలో పోలీస్‌ బలగాలు బందోబస్తు నిర్వహించాయి. ఈ సందర్భంగా మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభం, శుభం తెలియని తన బిడ్డను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి ఊరు వదిలి పోవాలని బెదిరించారని ఆరోపించారు. లేకుంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పంపిస్తానని సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాజేశ్‌ కుమార్‌ హెచ్చరించారని మండిపడ్డారు. తక్షణమే ఆయనను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇంటిపై దాడి చేసి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన టీడీపీ, జనసేన నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నాగమల్లేశ్వరరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు అల్లుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.

Best Web Hosting Provider In India 2024