Best Web Hosting Provider In India 2024
త్యాగాలకూ ఒక హద్దు ఉంటుంది. వాటిని గుర్తించి, తగిన ఆదరణ ఇవ్వకపోతే పరిస్థితులు వికటించే ప్రమాదమూ ఉంటుంది. 2014లో జనసేన నాయకులు, కార్యకర్తలు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆ ఐదేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలకు ఏలాంటి గుర్తింపు లభించలేదు. ఈ ఎన్నికల్లో కూడా త్యాగం చేసి కేవలం 21 సీట్లనే తీసుకొని తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక భూమిక పోషించారు.
2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన వాళ్లలో సింహభాగం.. తర్వాత పుట్టిన జనసేన పార్టీలో చేరి పని చేస్తూ వస్తున్నారు. అంటే జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం విశ్వసనీయంగా పని చేస్తున్నారు. ఈ 15 ఏళ్ల కాలంలో జనసైనికుల కృషికి, వారి పోరాటానికి ఎలాంటి గుర్తింపు దొరకలేదు. వారికి ఏ పదవీ ఎదురు రాలేదు.
దశాబ్దానికిపైగా ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్న జనసేన కార్యకర్తలు తమ త్యాగాలకు ప్రతిఫలంగా ఈసారి కచ్చితంగా అన్ని పదవుల్లో వాటా దక్కాల్సిందే అంటున్నారు! పార్టీతో పాటు కూటమి విజయంలో కీలకపాత్ర పోషించిన జనసైనికులు, అభిమానులు, సానుభూతిపరులు ఈ విషయంలో విస్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నారు. వారందరి ఉమ్మడి భావాలను క్రోడీకరించి నాయకత్వం తగు రీతిలో ముందడుగు వేయాల్సి ఉంటుంది.
100 శాతం స్ట్రైక్ రేట్
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వంద శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం వ్యవహారంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆ స్ట్రయిక్ రేట్ వెనక క్షేత్రస్థాయిలో జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్‌ని నిలబెట్టింది కార్యకర్తల శ్రమ, కృషి, మొక్కవోని వారి ధైర్యం మాత్రమే. ఇంత పెద్ద గెలుపు నమోదు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కాబట్టి, పవన్ కళ్యాణ్‌తో పాటు ఇంకో నలుగురు జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటే అది పొత్తు ధర్మం అనిపించుకోదు. పొత్తుకు ముందు ఒప్పుకున్నట్టుగా పారదర్శకంగా, సంపూర్ణంగా కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్(సీపీపీ)ని కూటమి అమలు చేయాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో వివిధ నామినేటెడ్ పదవులు, వివిధ ఎన్నికల్లో పవర్ షేరింగ్‌పై ప్రమాణ స్వీకారానికి ముందే కూటమిలోని పార్టీలు ఒక ఒప్పందానికి రావాలి. అన్ని రకాల పదవుల షేరింగ్‌పై నిర్థిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలి. దీనినే కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అంటారు.
దేశంలో, రాష్ట్రంలో వివిధ పార్టీలు పొత్తు పెట్టుకొని అధికారం పంచుకుంటున్నప్పుడు మంత్రివర్గంతో పాటు నామినేటెడ్ పదవుల్లో, ఆయా పార్టీల మధ్య పారదర్శకంగా పవర్ షేరింగ్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2004లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు బీఆర్‌ఎస్‌కి 5 మంత్రి పదవులు ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చారు. వీటితో పాటు వివిధ నామినేటెడ్ పోస్టులు, కార్పోరేషన్, స్థానిక సంస్థల పదవుల్లో ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అవకాశం కల్పించారు.
2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో ఐదుగురు లోక్‌సభ సభ్యులు ఉన్న పార్టీకి ఒక క్యాబినేట్ మంత్రి పదవి ఇచ్చారు. 2014లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చారు. ఇద్దరు బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు, ఒక రాజ్యసభ సీటు ఇచ్చారు. పొత్తు ధర్మాన్ని అనుసరించి కేంద్రంలో బీజేపీ సైతం టీడీపీకి ఒక క్యాబినేట్ పదవి, ఒక సహాయ మంత్రి పదవి ఇచ్చింది. ఈ ఉదంతాలన్నింటినీ జనసేనాని అధ్యయనం చేసి టీడీపీ నాయకత్వంతో చర్చలు జరిపాలి.
స్థానిక సంస్థల్లో సముచిత స్థానం
2024-2029 మధ్యకాలంలో పొత్తు ధర్మాన్ని పాటించి రాబోయే స్థానిక సంస్థలు, కార్పోరేషన్ ఎన్నికల్లో, నామినేటెడ్ పోస్టుల్లో జనసేన పార్టీకి కచ్చితంగా 1/3 పోస్టులను సీపీపీలో భాగంగా ఇవ్వాలి. తర్వాతి కాలంలో గొడవలు రాకుండా ఈ నిష్పత్తితో స్పష్టమైన ఒక ఒప్పందానికి రావాలి. రాష్ట్రంలో 660 జెడ్పీటీసీలు, 10,047 ఎంపీటీసీలు, 1,819 మున్సిపల్ కౌన్సిలర్ వార్డులు, 578 నగర పంచాయతీలు, 725 మున్సిపల్ కార్పోరేటర్ పోస్టులు ఉన్నాయి.
వీటన్నింటిలో 1/3 వంతు జనసేన పార్టీకి కేటాయించాలి. రాష్ట్రంలో 26 జిల్లా పరిషత్ చైర్మన్లు, 52 జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ల పదవులు ఉన్నాయి. వీటిలో 8 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు, 16 వైస్ చైర్మన్ పదవులు జనసేనకు ఇవ్వాలి. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్లో కూడా 1/3 వంతు జనసేనకు కేటాయించాల్సి ఉంటుంది.
పెద్దల సభలో సీట్లు ఇవ్వాలి..
జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి మంత్రివర్గంలో 1/3 మంత్రి పదవులను జనసేనకు కేటాయించాలి. అంటే, మొత్తం 26 క్యాబినేట్ మంత్రి పదవుల్లో 8 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. మంత్రివర్గంలో ఒక ఉపముఖ్యమంత్రి పదవి మాత్రమే ఉండాలి. దానిని జనసేనకు ఇవ్వాలి. అసెంబ్లీ స్పీకర్ లేదా డిప్యూటి స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వాలి. దీంతో పాటు చీఫ్ విప్ పదవి ఇవ్వాలి.
2026-28 వరకు 8 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అలాగే 2029 వరకు ఎమ్మెల్యే కోటాలో 20 ఎమ్మెల్సీలు, గవర్నర్ కోటాలో 6, స్థానిక సంస్థల కోటాలో 20 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. వీటన్నింటిలో జనసేన నాయకులకు 1/4 వంతు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకోవాలి. శాసనమండలి, రాజ్యసభలలో పార్టీలోని మేధావులకు స్థానం కల్పిస్తే పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు చట్ట సభల్లో తమ గళాన్ని బలంగా వినిపించే అవకాశం జనసేనకు దొరుకుతుంది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు జంగా కృష్ణామూర్తి, సి. రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మండలి చైర్మన్ వీరిని అనర్హులుగా ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీ కృష్ణ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరి విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యేగా గెలిచారు.
త్వరలో ఈ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. స్థానిక సంస్థల్లో జనసేన, టీడీపీ, బీజేపీకి తగినంత బలం లేదు కాబట్టి, ఈ ఖాళీల్లో కూటమి మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. తమ గళాన్ని మండలిలో వినిపించడానికి ఈ మూడింటిలో కచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని జనసేన కోరాలి.
న్యాయంగా కోర్టు పదవులు ఇవ్వాలి
గత పది సంవత్సారాలుగా జనసేన కోసం న్యాయవాదులు చేస్తున్న కృషి ఆ పార్టీ, అదే క్రమంలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ పెట్టిన కేసుల నుంచి కాపాడి, కష్టకాలంలో అండగా నిలబడ్డారు. పార్టీని బలోపేతం చేసుకోవడంలో భాగంగా న్యాయవాదులకు హైకోర్టు, కింది కోర్టుల్లో వివిధ పోస్టుల నియమకాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా జనసేన నాయకత్వం చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర హైకోర్టులో దాదాపు 90 స్టాండింగ్ కౌన్సిల్, 29 గవర్నమెంట్ ప్లీడర్లు, 82 అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పోస్టులున్నాయి. జిల్లా కోర్టుల్లో గవర్నమెంట్ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ల పోస్టులున్నాయి. వీటన్నింటిలో 1/3 వంతు పోస్టులు జనసేన నాయకత్వం సిఫార్సు చేసిన వారికి ఇచ్చేలా కూటమి పార్టీలతో జనసేనాని ఒప్పందం కుదుర్చుకోవాలి.
ధర్మంగా దేవాదాయ పోస్టులు ఇవ్వాలి
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం, అరసవెల్లితో పాటు ప్రధాన దేవాలయాల పాలకమండళ్ల నియామకాల్లోనూ పొత్తు ధర్మం పాటిస్తూ 1/3 వంతు చైర్మన్, సభ్యుల పదవులను జనసేన పార్టీ సిఫారసు చేసినవారికే ఇవ్వాలి. ప్రధాన దేవాలయాలతో పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దేవాలయాల పాలకమండలి నియామకాల్లో కూడా జనసేనకు భాగస్వామ్యం కల్పించాలి. దీంతో పాటు ప్రభుత్వ సలహాదారుల పోస్టుల్లో కూడా జనసేన సిఫార్సు చేసిన వారికి ఇవ్వాలి.
సీపీపీలో భాగంగా, పారదర్శకంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో పైన పేర్కొన్న పదవులన్నింటిలో జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తేనే, క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం అవుతుంది. భారీ విజయం సాధించడంతో కార్యకర్తల్లో అనేక ఆశలు ఉన్నాయి. ‘‘ఓట్లు మావి.. సీట్లు మీవా?’’ అనకుండా ఉండాలంటే, తన వెంట నడిచిన కార్యకర్తలకు ఈ సీపీపీ ద్వారా ప్రతిఫలాలు అందివ్వడం జనసేనాని కర్తవ్యంగా భావించాలి. ముందు చెప్పుకున్నట్టు త్యాగాలు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. పార్టీ భవిష్యత్తును త్యాగం చేయకుండా, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి జనసేనాని ధైర్యంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రజలను పట్టించుకుంటేనే
ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అప్పుడే మార్పు మొదలైందని పీపుల్స్ పల్స్ క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడయ్యింది. గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అప్పుడే ప్రజల్ని పట్టించుకోవడం మానేశారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు కేవలం తమ సామాజికవర్గం వారినే చేరదీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ మిగతా కార్యకర్తల్ని చులకనగా చూస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల కుమారులు, సోదరులు, అల్లుళ్లు, బావమరుదుల పెత్తనం పెరిగిపోయింది.
‘‘ప్రతి చేతికి పని… ప్రతి చేనుకు నీరు’’ అని ఎన్నికల ప్రచారం చేసిన జనసేన నాయకులు కేవలం తమ కుటుంబ సభ్యులకే పని కల్పించాలని చూస్తున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. సీపీపీలో కేవలం తమ పార్టీ నేతల కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టాలనుకుంటే అంతకు మించిన మోసం ఇంకోకటి ఉండదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు పవర్ షేరింగ్, మరోవైపు పార్టీ అంతర్గత విషయాలపై కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదు.
దీనికోసం క్రమం తప్పకుండా జనసేనాని వారితో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేయాలి. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు కులం, మతం చూడకుండా వివిధ పదవుల్లో భాగస్వామ్యం కల్పించడం కూడా సీపీపీలో అత్యంత కీలకాంశంగా భావించి పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలి.
– ఐ.వి.మురళీ కృష్ణ శర్మ పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, అభిప్రాయాలు, వ్యూహాలు రచయిత వ్యక్తిగతం మాత్రమే. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు.)
టీ20 వరల్డ్ కప్ 2024
టాపిక్