Best Web Hosting Provider In India 2024
Man sleeping in Pond : చెరువులో తేలియాడుతున్న దేహం.. దాదాపు ఐదు గంటల పాటు ఉలుకు, పలుకు లేకుండా పడి ఉండటంతో అక్కడున్న వాళ్లంతా కంగారు పడ్డారు. మృతదేహం తేలియాడుతోందని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డెడ్ బాడీని తీసుకెళ్లేందుకని పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఆ చెరువు వద్దకు చేరుకోగా.. ఆ వ్యక్తి ఒక్కసారిగా లేని నిలబడ్డాడు. శవమని వచ్చి లేపేందుకు చూస్తే.. మనిషి లేచి నిలబడటంతో అక్కడున్న వాళ్లంతా షాక్ కు గురయ్యారు. ఆయన చెప్పిన సమాధానం చూసి పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు. ఈ విచిత్రమైన ఘటన వరంగల్ నగర శివారు రెడ్డిపురం చెరువు వద్ద చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అసలేం జరిగింది?
వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి రెడ్డిపురం చెరువులో ఓ వ్యక్తి తేలియాడుతుండటాన్ని అటుగా వెళ్లే రైతులు, వాహనదారులు గమనించారు. గంటల పాటు అదే తీరుగా నీళ్లలో తేలుతుండటంతో గుర్తు తెలియని మృతదేహంగా భావించి, వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తేలియాడుతోందని చెప్పడంతో పోలీసులతో పాటు బాడీని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించేందుకని అంబులెన్స్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ఎవిడెన్స్ కోసం పోలీసులు డిపార్ట్మెంట్ ట్యాబ్ తో వీడియో తీస్తూ చెరువులో ఉన్న బాడీని బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఆయనను తాకడంతో స్పృహలోకి వచ్చిన ఆ వ్యక్తి ఒక్క సారిగా లేచి నిలబడ్డాడు. దీంతో పోలీసులు కంగు తిన్నారు.
మద్యం మత్తు.. ఎండ వేడి..
చెరువులో ఉన్న వ్యక్తి లేచి బయటకు రావడంతో అక్కడికి చేరుకున్న వాళ్లంతా నివ్వెర పోగా.. ఆయన చెప్పిన సమాధానం విని అందరూ గొళ్లున నవ్వారు. చెరువు నుంచి బయటకు వచ్చిన పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించారు. అతడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. మద్యం మత్తులో ఆయన ఇలా చేసినట్లు నిర్ధారాణకు వచ్చారు. కాగా తాను హనుమకొండ జిల్లా కాజీపేట సమీపంలోని గ్రానైట్ కంపెనీలో లేబర్ గా పని చేస్తానని, దాదాపు 12 గంటల శ్రమ, ఎండ వేడికి తట్టుకోలేక నీటిలో పడుకున్నట్లు తెలిపారు. ఒకవేళ నీటి లోపలికి వెళ్లి చనిపోతే ఎలాగని పోలీసులు ప్రశ్నిస్తే.. తాను కింద ఉన్న బండ రాయిని పట్టుకునే ఉన్నానని సమాధానం ఇవ్వడం గమనార్హం. కొద్దిసేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం తాను కాజీపేటకు వెళ్లిపోతానని, తనకు రూ.50 ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరాడు. కాగా పోలీసులతో పాటు అంబులెన్స్ సిబ్బంది విలువైన సమయాన్ని వృథా చేసినందుకు పోలీసులను అతడిని కాకతీయ యూనివర్సిటీ పీఎస్ కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీనివాస్ ను మందలించి, ఆయన అడిగిన 50 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. కాగా ఈ ఘటనంతా ఫోన్ లో వీడియో రికార్డ్ చేయగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్