Best Web Hosting Provider In India 2024
Manikonda Accident : హైదరాబాద్ లోని మణికొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. 20 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మణికొండ దేవాలయం సమీపంలో ఈరోజు తెల్లారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..అతివేగంగా వచ్చిన ఓ కారు మణికొండ దేవాలయం వద్దకు రాగానే అదుపు తప్పింది. దీంతో టెంపుల్ పక్కనే పార్క్ చేసిన బైకుల మీదకు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 బైకులు ధ్వంసం అయ్యాయి. పార్కింగ్ స్థానంలో నిలుచున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇదిలా ఉండగా కారు డ్రైవర్ పారిపోయేందుకు యత్నించగా…..స్థానికులు వెంబడించి పట్టుకున్నారు.
మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి నార్సింగ్ పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారును, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారు నడిపింది ఓ మైనర్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ కు సంబంధించి జూన్ 1 నుంచి కొత్త నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. డ్రైవింగ్ చేస్తూ మైనర్ పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా విధించాలని కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. కొన్ని సార్లు జరిమానా, జైలు శిక్ష రెండూ విధిస్తారు. రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా ఈ నూతన నిబంధన అమల్లోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
చెట్లకు నీరు పోస్తూ ఉండగా లారీ ఢీ
ఆదిలాబాద్ జిల్లా నేరేడి గొండ మండలం మామిడాల గ్రామ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ చెట్లకు నీరు పోస్తూ ఉండగా ఓ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని సంకాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ కేఎన్ఆర్ అనే సంస్థల్లో కూలీగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అయన మాన్సింగ్ రోడ్డుపై ఉన్న చెట్లకు నీరు పోస్తున్నాడు. అదే సమయానికి ఓ లారీ వేగంగా వచ్చి వాటర్ ట్యాంకర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జాదవ్ స్పాట్ లోనే మరణించారు. ప్రమాదం గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
టీ20 వరల్డ్ కప్ 2024
సంబంధిత కథనం
టాపిక్