
Best Web Hosting Provider In India 2024

Aloo 65: ఆలుగడ్డలు లేదా బంగాళదుంపలు… వీటితో చేసే స్నాక్స్ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము ఆలూ 65 రెసిపీ ఇచ్చాము. దీన్ని చూస్తేనే నోరూరి పోతుంది. పిల్లలకు ఇంకా నచ్చుతుంది. ఇంట్లోనే చాలా సులువుగా చేసేయొచ్చు. ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
ఆలూ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు – అర కిలో
మైదా – రెండు స్పూన్లు
బియ్యప్పిండి – రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – ఒక స్పూను
పసుపు – అర స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
నూనె – తగినంత
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
ఎండుమిర్చి – రెండు
పచ్చిమిర్చి – మూడు
కరివేపాకులు – గుప్పెడు
పెరుగు – అరకప్పు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు
ఆలూ 65 రెసిపీ
1. బంగాళాదుంపలను ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి.
2. చిటికెడు ఉప్పు కూడా వేయాలి. వాటిని పూర్తిగా ఉడకనివ్వకుండా 70 శాతం ఉడికాక స్టవ్ ఆఫ్ చేయాలి.
3. వాటిని చల్లార్చి పైన పొట్టు తీసేయాలి. వాటిని మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంప ముక్కలను వేసి మైదా, బియ్యప్పిండి, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.
5. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి కలపాలి.
6. పసుపు కూడా వేసి కలుపుకున్నాక వాటిని పక్కన పెట్టాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా కళాయి పెట్టాలి.
8. అందులో నూనె వేసి నూనె వేడెక్కాక ఈ బంగాళదుంపలను విడివిడిగా వేసుకుంటూ వేయించుకోవాలి.
9. అవి బంగారు గోధుమ రంగులోకి వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేయాలి.
11. అందులో వెల్లుల్లి రెబ్బల తరుగు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.
12. అందులోనే పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు కూడా వేయాలి.
13. అందులో చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేయాలి.
14. ఇందులోనే వేయించిన బంగాళదుంపలను వేసి ఓసారి ఇటూ అటూ కలుపుకొని పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.
15. అంతే టేస్టీ ఆలూ 65 రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
పిల్లలకు సాయంత్రం సమయంలో ఇది స్నాక్ గా పెడితే ఇష్టంగా తింటారు. ఒక్కసారి దీన్ని చేసి పిల్లలకు ఇవ్వండి. వారికి ఇది నచ్చడం ఖాయం.