Best Web Hosting Provider In India 2024
విజయవాడ : తాను ఎప్పటికీ సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. అనివార్య కారణాలవల్ల నియోజకవర్గంలో తాను కొంతకాలంగా చురుగ్గా లేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. తన మనసు సహకరించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానే తప్ప పార్టీ మారబోనన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ తనను పిలిపించి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై తనకు స్పష్టతనిచ్చారన్నారు. మరో వారం రోజుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానన్నారు.
టీడీపీకి లోకేశ్ పెనుభారం
లోకేశ్ పాదయాత్ర టీడీపీకి పెనుభారమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. ఇక ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టీడీపీని ఏ విధంగా దొంగిలించాడో అదే రీతిలో మాజీమంత్రి దేవినేని ఉమా కబ్జాల సంస్కృతి నేర్చుకున్నాడని వసంత ఆరోపించారు. పార్టీ కార్యాలయం కోసం వృద్ధ మహిళ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన ఉమా.. రూ.300 కోట్లపై చిలుకు ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.20 కోట్లు తీసుకుని ఎన్నికల్లో ఖర్చుచేశాడన్నారు. గుంటుపల్లికి చెందిన ఒక నాయకుడి వద్ద రూ.7 కోట్లు, కొండపల్లికి చెందిన మరో వ్యక్తి వద్ద రూ.5 కోట్లు, మూర్తి అనే కాంట్రాక్టర్ వద్ద రూ.3 కోట్లు తీసుకున్నాడని, మరో ఇద్దరి వద్ద రూ.50లక్షల చొప్పున తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా వాళ్ల ఫోన్లు కూడా ఎత్తడంలేదని వసంత చెప్పారు.