Best Web Hosting Provider In India 2024

సచివాలయం: తప్పు ఎవరు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదని, ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, 12వ తేదీ అర్ధరాత్రి తాడేపల్లిలో బాలికను హింసించి హతమార్చిన నిందితుడిని గంటలోపే పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. గంజాయి మత్తులో ఆ వ్యక్తి మైనర్ బాలికను హత్య చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అది గంజాయి మత్తు కాదు, మద్యం మత్తులో హత్య చేశాడని హోంమంత్రి స్పష్టం చేశారు. వారికున్న వ్యక్తిగత గొడవలతో మద్యం మత్తులో వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, గొడవ చేసి హత్య చేశాడని, హత్య జరిగిన గంటలోపే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. మైనర్ బాలిక హత్యకు గురవ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం వైయస్ జగన్ ప్రకటించారని చెప్పారు. నేరాలు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. సచివాలయంలో హోంమంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.