Best Web Hosting Provider In India 2024
విశాఖపట్నం: రాబోయే కొద్ది నెలల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం నూతన రాజధాని కాబోతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్న గ్లోబల్ టేక్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం రాజన్న దొర, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, వైయస్ఆర్ సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పారిశ్రామిక వేత్తలు, పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని కాబోతోందని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెప్పారు. పరిశ్రమలు స్థాపించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ విశాఖలో ఉన్నాయని చెప్పారు. విశాఖపట్నం దేశంలోని టాప్ సిటీస్‌లో ఒకటిగా, ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.. రాబోయే రెండు నెలల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు విశాఖకు రాబోతున్నాయని, ఇన్ఫోసిస్ కూడా ఏర్పాటవుతుందన్నారు.
త్వరలోనే విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరుపుతామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వివరించారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటని, త్వరలో భోగాపురం వద్ద ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాలపై చర్చ నిర్వహిస్తున్నారు. సదస్సులో వెయ్యి మంది ప్రతినిధులు పాల్గొన్నారు. జి–20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చెయ్యాలి, అవసరమైన నాణ్యతా ప్రమాణాలపై చర్చ జరుగుతుంది.