Best Web Hosting Provider In India 2024
Anakapalle Murder: రాష్ట్రంలో సంచలనంగా మారిన తొమ్మిదో తరగతి బాలిక హత్య కేసులోని నిందితుడిపై రూ.50 వేల రివార్డు పోలీసు శాఖ ప్రకటించింది. ఆ నిందితుడి ఆచూకి తెలిన వారికి రూ.50 వేల నగదు బహుమతి ఇస్తామని అనకాపల్లి పోలీసు తెలిపింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామంలో మైనర్ బాలికను హత్య చేసిన వివరాలతో కూడిన పోస్టర్‌ను అనకాపల్లి పోలీసులు విడుదల చేశారు. ఆ ముద్దాయి పోటోలతో సహా హత్య చేసినప్పడు ఏ బట్టలు ధరించి ఉన్నాడో అందులో తెలిపారు.
హత్య చేయడానికి ముందు ఎర్ర టీషర్ట్‌తో ఉన్న ముద్దాయి, హత్య చేసిన తరువాత నలుపు రంగు పుల్ హాండ్స్ టీ షర్ట్, నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ముద్దాయి పేరు బోడాబత్తుల సురేష్, తండ్రి పేరు ఈశ్వరరావు, వయస్సు 26 ఏళ్లు, కాపు కులం, డ్రైవర్ వృత్తి, ఎత్తు 5.7, చామన్ చాయ రంగు, కొప్పుగుండుపాలెం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా అని అనకాపల్లి పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌లో పేర్కొన్నారు.
ఈ ముద్దాయి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇస్తే రూ.50 నగదు బహుమతి ఇస్తామని, వివరాలు ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అలాగే ఆచూకీ తెలిసిన వారు 9440796084, 9440796108, 9440904229, 7382625531 ఫోన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞాప్తి చేశారు.
ఈనెల 6న అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14)ని బోడాబత్తుల సురేష్ (26) హత్య చేశాడు. వెంటనే ఆ కిరాతకుడు పరారయ్యడు. ముద్దాయిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ముద్దాయి ఆచూకీ లభించకపోవడంతో అనకాపల్లి పోలీసులు ఆయనపై రివార్డు ప్రకటించారు.
ఆ ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ముద్దాయిని వెంటనే పట్టుకొని, చర్యలకు ఉపక్రమించాలని పోలీసులను ఆదేశించారు. హత్య చేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.
ఘటన జరిగిన ప్రాంతంలో నిందితుడురాసిన లేఖలో తనను క్షమించాలని కోరాడు. 13పేజీల లేఖలో కొంత భాగం హత్య చేసిన తర్వాత రాసినట్టు గుర్తించారు. హతురాలు తనను దూరం పెట్టడాన్ని భరించలేక హత్య చేయాలని భావించినట్టు అందులో పేర్కొన్నాడు. నిందితుడి అచూకీ దొరక్క పోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
అసలేం జరిగింది..
రాంబిల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో బద్ది దర్శిని తొమ్మిదో తరగతి చదువుతుంది. కశింకోటకు చెందిన బోడాబత్తుల సురేష్(26) కొప్పుగుండుపాలెంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. జూలాయిగా తిరిగే ఆ ప్రేమోన్మాది ఏడాదిగా ఆ బాలిక వెంట పడ్డాడు. ప్రేమ పేరుతో ఆ బాలికను వేధించేవాడు. అయితే దర్శిని అందుకు నిరాకరించింది. సురేష్ వేధింపులు తాలలేక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రులతో కలిసి రాంబల్లి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు సురేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ కేసుపై సురేష్‌ను జైలుకు కూడా పంపారు. దీంతో ఆ బాలికపై కక్ష పెంచుకున్న సురేష్ ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యాడు. దర్శిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో దర్శిని స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లిదండ్రులు పనులు ముగించుకుని ఇంటికి రారని, అదే సమయంలో హత్య చేయాలని భావించాడు.
చిన్నారి దర్శిని రోజులానే ఆ రోజు కూడా (జులై 6, శనివారం) పాఠశాలకు నుంచి సాయంత్రం ఇంటికి వచ్చింది. అయితే ఇంట్లో ఎవరూ లేరని భావించి బాలిక ఇంట్లోకి సురేష్ దూరి, వేట కొడవలితో హతమార్చడు. హత్య చేసి కొద్ది సేపటికి సురేష్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. దీన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే ఇంటి లోపలికి వెళ్లి చూసింది. రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేసింది. ఏం జరుగుతుందో నని ఇంటి చుట్టుపక్కల వారు అక్కడి వచ్చారు. రక్తపు మడుగులో ఉన్న బాలిక, పక్కనే విలపిస్తున్న నాన్నమ్మను చూసి నివ్వెరపోయారు. అయితే స్థానికులు వచ్చి బాలికను పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన దర్శిని తల్లిదండ్రులు వెంకటరమణ, వరలక్ష్మిలు కుతురు హత్యతో ఉదాంతం తెలిసి విషాదంలోకి వెళ్లిపోయారు. కన్నీరుమున్నీరు అవుతూ గుండెలవిసేలా రోదించారు. ఆ చిన్నారి హత్య స్థానికుల్లో సైతం ఏడ్పును తెచ్చింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.
సురేష్ తన మనవరాలిని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అందువల్ల క్లూసీ టీమ్‌లను రంగంలోకి తెప్పించి, నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అయినప్పటికీ ముద్దాయి ఆచూకీ తెలియడం లేదు. దీంతో తాజా ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల నగదు బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
జగదీశ్వరరావు జరజాపు
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్