Best Web Hosting Provider In India 2024
Warangal Murder: భూ తగాదా నేపథ్యంలో వరంగల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. తాజా మాజీ సర్పంచ్ తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పెద్ద సుత్తెతో కొట్టి ఆయనను చంపేశారు. దీంతో పోలీసులు జాగిలాలను రంగంలోకి దించగా, అవి ఓ ఇంటి వద్ద ఆగిపోవడంతో భూతగాదానే కారణమనే విషయం స్పష్టమవుతోంది.
స్థానికులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురాహన్ పల్లికి చెందిన సూదుల దేవేందర్(56) మొన్నటి వరకు సర్పంచ్ గా పని చేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉండగా, పెద్ద కుమార్తె వివాహం జరగడంతో కొంతకాలం కిందటే అల్లుడితో కలిసి అమెరికాకు వెళ్లిపోయింది.
కొద్దిరోజుల కిందట ఆమె గర్భం దాల్చడంతో సాయంగా ఉండేందుకు దేవేందర్ భార్య ఉమ ఐదు నెలల కిందట అమెరికాకు వెళ్లింది. మరో కుమార్తె పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో ఉంటుండగా, కొడుకు నిఖిల్ కూడా హైదరాబాద్లోనే ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. దీంతో ప్రస్తుతం దేవేందర్ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.
పల్లె మహేష్ తో భూవివాదం
సర్పంచ్ గా కొనసాగుతున్న దేవేందర్ కు, గ్రామస్థుడైన పల్లె మహేష్ కు మధ్య కొంతకాలంగా ఓ భూమి విషయంలో గొడవలు జరగుతున్నాయి. రాయపర్తి మండలంలోని కొండూరుకు చెందిన ప్రకా ష్ కు బురహన్ పల్లి శివారులో మూడెకరాల భూమి ఉండగా, దానిని దేవేందర్ కు అమ్మేందుకు రూ.4లక్షలు బయానాగా తీసుకున్నాడు. కానీ దేవేందర్ మిగతా డబ్బులు చెల్లించకపోవడం, రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకపోవడంతో ప్రకాష్ అదే స్థలాన్ని బురహన్ పల్లికి చెందిన పల్లె మల్లేష్ కు అమ్మాడు.
దీంతో విషయం తెలుసుకున్న దేవేందర్ తాను బయానాగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రకాష్, పల్లె మల్లేష్ పై ఒత్తిడి తెచ్చాడు. వారు అందుకు అంగీకరించకపోవడంతో రాయపర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, పెద్దలు చేసిన తీర్మానానికి దేవేందర్ అంగీకారం తెలపలేదు.
అప్పటినుంచి దేవేందర్, పల్లె మల్లేష్ మధ్య వివాదం కొనసాగుతుండగా, రెండేళ్ల క్రితం పల్లె మల్లేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్ త్రుటి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ దాడి వెనక దేవేందర్ హస్తం ఉందని భావించి మహేష్ ఆయనపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది.
చంపిన సుత్తె.. బకెట్ లో పడేసి
దేవేందర్ ఇంట్లో ఒక్కడే ఉండగా, గుర్తు తెలియని దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. భారీ సుత్తితో తలపై గట్టిగా బాదడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం దేవేందర్ చనిపోయాడని నిర్ధారించుకుని సుత్తెను బాత్రూంలో ఉన్న నీళ్ల బకెట్ లో పడేసి వెళ్లిపోయారు. కాగా దేవేందర్ ఇంట్లో పని మనిషిగా చేసే ఓ మహిళ సోమవారం ఉదయం తలుపు తీసి చూసే సరికి ఆయన నెత్తుటి మడుగులో కనిపించాడు.
దీంతో కేకలు కేకలు బయటకు వెళ్లిన ఆమె విషయాన్ని గ్రామస్థులకు తెలియజేసింది. దీంతో గ్రామస్థులంతా అక్కడికి చేరగా, సమాచారం అందుకున్న దేవేందర్ కుమారుడు నిఖిల్ తన తండ్రిని పల్లె మల్లేష్, అతడి కుమారుడు పల్లె మురళీ హత్య చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మహేష్ ఇంటి వద్ద ఆగిన జాగిలాలు
కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జాగిలాలను రంగంలోకి దించగా దేవేందన్ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన జాగిలాలు చివరకు పల్లె మల్లేష్ ఇంటి వద్దకు వెళ్లి నిలిచి పోయాయి. దేవేందర్ ను పల్లె మహేష్ హత మార్చాడనే ఆరోపణలకు బలం చేకూరింది. దీంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటన స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ మహేందర్ నాయక్ వర్ధన్నపేట సీఐ సూర్య ప్రకాష్, రాయపర్తి ఎస్ఐ సందీప్ పరిశీలించారు. అనంతరం దేవేందర్ మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా నిందితులు సోమవారం సాయంత్రం తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్