Best Web Hosting Provider In India 2024
వైయస్ఆర్‌సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై టీడీపీ నేతల హత్యాయత్నం
సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నలుగురి అరెస్ట్
విజయవాడ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా పనిచేశాడనే అక్కసుతో ఆయనపై హత్యాయత్నం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణ అలియాస్ బుజ్జి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ సెక్టార్–1లో నివసిస్తున్నారు. రోజూలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుకుని ఇంటికి వస్తుండగా సెక్టార్–2 ఆకాష్ అపార్ట్‌మెంట్స్ వద్దకు వచ్చేసరికి నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఆయన్ని అడ్డగించి ఒక్కసారిగా దాడిచేశారు. మోహంమీద, శరీరంపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనున్న రాయితో కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించారు.
చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగాగాయపడిన బుజ్జిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం చేసింది టీడీపీకి చెందిన కాకొల్లు మహేంద్ర, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, బెజ్జం జయపాల్, షేక్ గౌస్‌బాషాగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు.
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ స్పందించాలి: వెలంపల్లి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైయస్ఆర్‌సీపీ నేతలు పోతిన వెంకటమహేష్, తోలేటి శ్రీకాంత్ పరామర్శించారు. అనంతరం వెలంపల్లి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ టీడీపీ సంకెళ్లలోఉందని విమర్శించారు. నార్త్‌జోన్ ఏసీపీ కార్యాలయం సమీపంలోనే దారుణం జరిగిందన్నారు.
దాడులను అరికట్టాలని ఇటీవల సీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని చెప్పారు. ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నాడని, సెంట్రల్ నియోజకవర్గంలో 35 మందిపై దాడులు జరిగాయన్నారు. బొండా ఉమా మర్యాదగా ఈ దాడులు ఆపాలని సూచించారు. పోలీసు వ్యవస్థ ఈ దాడులను అరికట్టకపోతే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడతారని హెచ్చరించారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.