RaithuRunaMafi: రైతు రుణమాఫీ లిస్ట్ రెడీ…ప్రత్యేక యాప్ లో రైతులు జాబితా సిద్ధం?

Best Web Hosting Provider In India 2024

RaithuRunaMafi: అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి సమయం ఆసన్నమైంది. ఆగష్టు 15 లోగా రైతుల రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సర్కార్ సర్వసన్నద్దమయ్యింది. అందుకు సంబంధించిన రైతుల జాబితాను బ్యాంకర్లు సిద్దం చేశారు.

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతులు పంట రుణమాఫీపై లిస్ట్ రెడీ అయింది. రెండు లక్షల వరకు పంటరుణాలు తీసుకున్న రైతుల జాబితాను బ్యాంక్ అధికారులు సిద్దం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు.

ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్ లో నమోదు చేశారు. ఎట్టకేలకు రుణమాఫీపై కదలిక రావడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది.

క్షేత్ర స్థాయిలో సర్వే ప్రత్యేక యాప్ వివరాలు అప్ లోడ్

రుణమాఫీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది సహకార సంఘాల పరిధి డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల వరకు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ఇటీవల సహకార శాఖ అదికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.

 

ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో వివరాలను నమోదు చేశారు. జమ్మికుంట, తనుగుల, ఇల్లందకుంట, మల్యాల, బోగంపాడు, శంకరపట్నం మండలాల్లోని మెట్ పల్లి, జగిత్యాల జిల్లాలో కోనాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు సహకార సంఘాల్లో రైతు రుణాలపై వివరాలను సేకరించేందుకు ప్రతీ సంఘానికి ఇద్దరు చొప్పున ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఆయా సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారనే విషయంపై డీసీసీబీ, ఎస్బీఐ రికార్డుల ఆధారంగా వివరాలు సేకరించి యాప్ లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ రెండ్రోజుల క్రితమే పూర్తయింది.

ప్రతీ సంఘం పరిధిలో 250 నుంచి 300 మంది రైతులు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది సహకార సంఘాల పరిధిలోని ఆయా బ్యాంకుల్లో రెండు వేల నుంచి 2400 వరకు అన్నదాతలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వారందరిని రుణ మాఫీకి అర్హులుగా నివేదించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆరు సహకార సంఘాల పరిధిలో డీసీసీబీ, ఎస్బీఐ ద్వారా రూ.2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను సేకరించి ప్రత్యేక యాప్ లో నమోదు చేశామని కరీంనగర్ జిల్లా జాయింట్ రిజిస్ట్రార్, డీసీవో ఎస్.రామాంజనేయచార్య తెలిపారు. రుణమాఫీ రైతుల వివరాలు నేరుగా ప్రభుత్వానికే వెళ్తాయని చెప్పారు. ప్రభుత్వ నియమనిబంధనల మేరకు ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ అయిన రైతుల రెండు లక్షల వరకు రుణమాఫీ కానుంది.

 

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel
 

టాపిక్

 
 
Telugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsTelangana NewsFarmersTg Welfare Schemes
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024